Monday, December 23, 2024

హైదరాబాద్‌తో రంజీ పోరు.. సూర్య మెరుపు ఇన్నింగ్స్

- Advertisement -
- Advertisement -

సూర్య మెరుపు ఇన్నింగ్స్.. రహానె, యశస్వి శతకాలు
హైదరాబాద్‌తో రంజీ పోరు, ముంబై 457/3
ముంబై: హైదరాబాద్‌తో మంగళవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ అసాధారణ రీతిలో రాణించడంతో ముంబై మొదటి రోజే మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. ఓపెనర్ పృథ్వీషా (19) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.

సూర్యకుమార్ తనదైన స్టయిల్‌లో ధాటిగా ఆడాడు. వరుస ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. యశస్వి కూడా అద్భుతంగా ఆడడంతో ముంబై స్కోరు వేగంగా పరిగెత్తింది. రంజీ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ ఆకట్టుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచిన సూర్య 80 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 90 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 153 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ అజింక్య రహానె కూడా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. ఇటు యశస్వి అటు రహానె తమ మార్క్ బ్యాటింగ్‌తో స్కోరును ముందుకు నడిపించారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 195 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 162 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ రహానెతో కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 206 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె తొలి రోజు ఆట ముగిసే సమయానికి 18 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 139 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి సర్ఫరాజ్ ఖాన్ 40 (బ్యాటింగ్) అండగా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News