వాషింగ్టన్ : ముంబయిలో 2008లో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి కీలక నిందితుని భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్కు అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతై నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్థుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని కోర్టు స్పష్టం చేసింది. తహవుర్ రాణాను అప్పగించాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిరి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. అయితే, రాణా కోర్టును ఆశ్రయించడంతో అప్పగింత వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పలు కోర్టుల్లో వేసిన పిటిషన్లను కొట్టివేయడంతో రాణా చివరి ప్రయత్నంగా అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
తాజాగా సుప్రీం కోర్టు కూడా తిరస్కరించడంతో రాణాను భారత్కు అప్పగించడం ఖాయమని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2008 నవంబర్ 26న ముంబయిల పాకిస్తానీ టెర్రరిస్టులు దాడి చేసిన విషయం విదితమే. ఆ దాడుల్లో పది మంది అమెరికా పౌరులు కూడా హతులయ్యారు. ఆ దాడులకు పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కొలమన్ హెడ్లీతో కలసి తహవుర్ రాణా కుట్ర పన్నినట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్తాన్ మూలాలు ఉన్న తహవుర్ రాణా (64) కెనడా పౌరుడు అని, ముంబయి దాడులకు ప్రధాన సూత్రధారి అని భారత్ తెలిపింది. ఒక కేసులో అరెస్టు అయి అమెరికా జైలులో ఉన్న రాణాను అప్పగించాలని అగ్ర రాజ్యాన్ని భారత్ కోరింది. రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైలులో ఉన్నాడు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంల రాణాను భారత్కు అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.