పాకిస్తాన్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మరణించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరించింది. భుట్టవి 29 మే 2023న పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో పాకిస్తాన్ ప్రభుత్వ నిర్బంధంలో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. భుట్టవి లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయూద్ కి డిప్యూటీగా పనిచేశాడు. భుట్టవీ మొదటిసారిగా భద్రతా మండలి 2012లో అల్-ఖైదాతో సంబంధం కలిగి ఉండటంతో వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.
ముంబై దాడుల జరిగిన అనంతరం 2008లో హఫీస్ సయీద్ ను అరెస్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం, సయీద్‌ను నిర్బంధించినప్పుడు కనీసం రెండు సందర్భాలలో భుట్టవి ఎల్ఇటి లేదా జమాత్-ఉద్-దవా (జెయుడి) తాత్కాలిక ఎమిర్‌గా పనిచేశారు. నవంబర్ 2008 ముంబై దాడుల తర్వాత సయీద్ జూన్ 2009 వరకు నిర్బంధించబడ్డాడు.
ఈ కాలంలో భుట్టవి రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాడు. సంస్థ తరపున స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 2002లో సయీద్‌ను అక్కడి ప్రభుత్వం అతన్ని అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేసింది. కొన్నాళ్ల తర్వాత పాక్ ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేసి, ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు సయీద్ బావ అబ్దుల్ రహ్మాన్ మక్కీతో పాటు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై ఆగష్టు 2020 అతనికి 16.5 సంవత్సరాల శిక్ష విధించింది.