ముంబై : పక్కనే మహాసముద్రం. దేశానికి వాణిజ్య రాజధాని అయిన మహానగరం ముంబైకి మంచినీటి కష్టాలు దాపురించాయి. ముంబైకి నీటిని సరఫరా చేసే ప్రధాన జలాశయాల్లో ఇప్పుడు కేవలం 26 శాతం నీరే మిగిలింది. ప్రతిరోజు లక్షల గ్యాలన్ల కొద్ది నీరు జనం అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. తక్కువ జలవనరులతో ఇప్పుడు నగరంలో భారీ స్థాయిలో నీటి కటకట ఏర్పడనుంది. రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడంతో , ఇప్పటికీ ఓ మోస్తరు వర్షాలే పడటంతో జలాశయాలలో నీరు వచ్చిచేరడం లేదు. ఉన్న నీరు అడుగంటిపోతోంది. దీనితో నగరజీవులు వర్షకాలంలోనే భారీ నీటికోతలకు గురి కావల్సి ఉంటుంది. ఈ మధ్యలో నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. అయినప్పటికీ జులై 1 నుంచి కోతలు విధించనున్నారు. ముంబైకి ఏడు రిజర్వాయర్ల నుంచి మంచినీటి సరఫరా అవుతోంది. విహార్, తులసి, తన్‌సా, భట్సా, మోడక్, అప్పర్ వైతరణ, మిడిల్ వైతరణల నుంచి నీరు సరఫరా అవుతుంది.
అన్ని జలాశయాలల్లో ఉన్న నీటి పరిస్థితిని చూస్తే కేవలం 26 శాతం వరకే నీరు ఉన్నట్లు తేల్చారు. దీనితో నీటికోసం జంజాటం తప్పేలా లేదని వెల్లడైంది. గత సంవత్సరం ఇదే కాలంలో 30 శాతం వరకూ జలాశయాలలో నీరుంది. కానీ ఈసారి తగ్గింది. జులై 1 నుంచి 10 శాతం నీటికోత విధిస్తున్నట్లు నగర పాలక మండలి బిఎంసి కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ముంబైలో ఏడు రిజర్వాయర్ల నుంచి ప్రతి రోజూ 3800 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతోంది. కాగా ఆదివారం నుంచి రుతుపవనాల బలీయతతో మహారాష్ట్రలో వీడకుండానే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వచ్చే వారం రోజులలో పరిస్థితి మెరుగుపడవచ్చునని, అప్పుడు తిరిగి పరిశీలించి సరఫరాలపై నిర్ణయం తీసుకుంటారని స్థానిక అధికారులు తెలిపారు.
భారీ వర్షాలతో ఓ వైపు మహానగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శివార్లలోని అంధేరీ ఇతర చోట్ల వాననీటితో పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో జనం నానా ఇక్కట్లకు గురయ్యారు. అంధేరి సబ్‌వేలోకి నీరు చేరింది. ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.