Wednesday, January 22, 2025

విదర్భ ముందు భారీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

పట్టుబిగించిన ముంబై, రంజీ ట్రోఫీ ఫైనల్ పోరు

ముంబై: విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై పటిష్ఠస్థితిలో నిలిచింది. విదర్భ ముందు 538 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే మిగిలిన రెండు రోజుల్లో విదర్భ మరో 528 పరుగులు చేయాలి. అయితే పటిష్ఠమైన బౌలింగ్ లైనప్ కలిగిన ముంబైని తట్టుకుని ఈ లక్ష్యాన్ని ఛేదించడం విదర్భకు దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. కాగా, ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 130.2 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్ అజింక్య రహానె ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన శ్రేయస్‌తో కలిసి మరో యువ సంచలనం ముషీర్ ఖాన్ పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. ఇద్దరు ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ముషీర్ రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరచగా, శ్రేయస్ దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగిన శ్రేయస్ స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన శ్రేయస్ 111 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో నాలుగో వికెట్‌కు ముషీర్‌తో కలిసి 168 పరుగులు జోడించాడు.

ఇక సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ముషీర్ ఖాన్ 326 బంతుల్లో పది ఫోర్లతో 136 పరుగులు సాధించాడు. మిగతా వారిలో షమ్స్ ములానీ ఒక్కడే రాణించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ములానీ ఆరు ఫోర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ముంబై స్కోరు 418 పరుగులకు చేరింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో హర్ష్ దూబే ఐదు, యశ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టారు. కాగా, ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసింది. విదర్భ మొదటి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. ఇదిలావుంటే ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ముంబై మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ముంబై విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ముంబైకి మరో ట్రోఫీ ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News