ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ముంబై : 2012 లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లోని ‘నిర్భయ’ సంఘటనను తలపించేలా ముంబైలో మానవ మృగాల పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. ఆ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ముంబై సాకినాక శివారు ప్రాంతం లోని ఖైరానీ రోడ్డు వద్ద ఒంటరిగా ఉన్న 34 ఏళ్ల మహిళపై కొందరు దుండగులు శుక్రవారం రాత్రి అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె మర్మాయవయాల్లో ఇనుపరాడ్ జొప్పింది పైశాచిక ఆనందం పొందారు. ఖైరానీ రోడ్డులో ఉన్న ఓ కంపెనీ వాచ్‌మేన్ శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఖైరానీ రోడ్డులో ఓ మహిళను దుండగుడు ఎవరో కొడుతున్నాడని తెలియచేయడంతో ఈ సంఘటన వెలుగు లోకి వచ్చింది. పోలీసులు అక్కడకు వెళ్లేసరికి బాధితురాలు రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉంది.
దీంతో వెంటనే ఆమెను పోలీసులు ఘాట్కోపార్ లోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ టెంపో పార్కు చేసి ఉంది. దాన్ని పరిశీలించగా అందులో రక్తపు మరకలు కనిపించాయి. ఆ ప్రాంతంలో ఉన్న సిసిటివి ఫుటేజి ఆధారంగా 45 ఏళ్ల మోహన్ చౌహాన్ నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దారుణం తరువాత నిందితుడు టెంపో వాహనంలో పారిపోయినట్టు సిసిటివిలో రికార్డయింది. ఈ దారుణంలో మరి కొంతమంది పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిపై మొదట అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు బాధితురాలు మరణించడంతో ఆ కేసును అత్యాచారం, హత్యగా మార్చారు. ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ముంబై పోలీసులకు సూచించింది.
ఫాస్ట్‌ట్రాక్ విచారణ: మహారాష్ట్ర సిఎం థాకరే
ఈ దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చఅని, ఫాస్ట్‌ట్రాక్ విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్, హోం మంత్రి దిలీప్ వాల్షేపటేల్, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలేతో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని బిజెపి డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో మహిళలకు భద్రత లోపించిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి బొంబై హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌ను కలసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ వేగంగా జరిగేలా చూడాలని కోరాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టం తరహా లోనే కొత్త చట్టాన్ని తీసుకు వచ్చి ఇలాంటి నిందితులకు అంత సులువుగా బెయిల్ దొరక్కుండా చేయాలని బిజెపి ఉపాధ్యక్షుడు చిత్రవాఘ్ డిమాండ్ చేశారు.