Saturday, November 16, 2024

కౌన్ బనేగా మేయర్

- Advertisement -
- Advertisement -

మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నిక నేడే
కొవిడ్ పాజిటివ్‌లకు వర్చువల్‌గా అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్: మినీ పురపోరులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం శుక్రవారం(మే 7వ తేదీ) పరోక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల పాలక మండళ్లకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాయి. ఈ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరుగగా, ఈ నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయా కార్పోరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాల కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారులు గురువారం ఎన్నిక నోటీసు జారీ చేశారు. పార్టీల విప్‌లకు అనుగుణంగా చేతులెత్తే విధానంలో ఎన్నిక జరుగుతుంది. కార్పోరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణం, మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మొదటి రోజు ఎన్నిక జరగకపోతే రెండవ రోజు ఎన్నిక నిర్వహించాలని తెలిపింది. భౌతికదూరం పాటిస్తూ పెద్దహాళ్లలో పరోక్ష ఎన్నిక నిర్వహించాలని, పెద్దహాల్ లేకపోతే విశాలమైన ఆవరణలో షామియానాల కింద నిర్వహించాలని స్పష్టం చేసింది. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, కొవిడ్ నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే హాల్‌లోకి అనుమతించాలని ఎస్‌ఇసి స్పష్టం చేసింది.
పాజిటివ్ వచ్చినా ప్రమాణ స్వీకారం
ఎవరైనా కొవిడ్ పాజిటివ్‌తో హోం క్వారంటైన్‌లో ఉంటే వారు వీడియోకాల్ ద్వారా ప్రమాణస్వీకారం చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికలో కూడా వీడియోకాల్ ద్వారా ఓటు వేయవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియను ప్రెసైడింగ్ ఆఫీసర్ ఫోన్‌లో రికార్డింగ్ చేయాలని పేర్కొంది. ఎన్నికైన అభ్యర్థి కోరితే సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించారు. ఎన్నికైన సభ్యులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించాలని తెలిపింది. పూలదండలు, బొకేలు, సన్మానాలకు అనుమతి లేదని, ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు అనుతించవద్దని స్పష్టం చేసింది. పరోక్ష ఎన్నిక సందర్భంగా కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై విచారణ, కేసులు నమోదు చేయాలని ఎస్‌ఇసి అధికారులను ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించింది.

Municipal Chairman election on Tomorrow in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News