మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ కౌన్సిలర్‌లకు గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె ఎల్ ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శనివారం విజ్ఞప్తిచేశారు. మున్సిపల్ కౌన్సిలర్‌లకు 2500 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని దానిని 13 వేలకు పెంచాలని తెలంగాణ మున్సిపల్ కౌన్సిలర్ సంఘం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు.
కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారని, వారికి కచ్చితంగా గౌరవ వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా కవితకు వారు విజ్ఞప్తిచేశారు. ఈ విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి గౌరవ వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ కౌన్సిల్ అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ నీలం శ్వేత, రాష్ట్ర కార్యదర్శి అల్వాల జ్యోతి, మమతా తదితరులు పాల్గొన్నారు