ముగిసిన మినీ పురపోరు ఎన్నికల ప్రచారం
30న పోలింగ్.. మే 3న ఓట్ల లెక్కింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మినీ పురపోరుకు సంబంధించి ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలు హోరాహోరిగా చేసిన ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలలో ఆయా పార్టీల నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో మారుమోగిన మైకులు బందయ్యాయి. ఎండలను లెక్కచేయకుండా పార్టీ నేతలు ప్రచారం చేశారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 3న మున్సిపల్ ఎన్నికల ఓట్లు లెక్కించనున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులను నియమించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఇసి ఇదివరకే సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వార్డుకు ఒక వైద్యాధికారిని నోడల్ అధికారిగా నియమించడంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎఎన్‌ఎం, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లను నియమించి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్కు ధరించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతించనున్నారు. పోలింగ్ కేంద్రం వెలుపల, లోపల భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఓటర్లు వేచి ఉండడానికి అనువుగా షామియానాలు, కుర్చీలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్, పోలీసు సిబ్బందికి మాస్కు, ఫేస్ షీల్డ్, శానిటైజర్, చేతి గ్లౌజులను పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం, ఫర్నీచర్‌ను ముందు రోజే శానిటైజ్ చేయడంతో పాటు కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు.
Municipal election campaign ends in Telangana