Tuesday, November 5, 2024

మునిమాణిక్యం అద్భుత సృష్టి ‘కాంతం’

- Advertisement -
- Advertisement -

కాంతం పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మునిమాణిక్యం నరసింహారావు. కాంతం కథల ద్వారాఅయన తెలుగు పాఠకులకు సుపరిచితులు. తెలుగు సాహిత్యంలో ఒక కాంతం అన్న పాత్రను సృష్టించి ఆ పేరున ఎన్నో రచనలు చేశారు. కాంతం కథల’తో తెలుగువాళ్ల మనసుల్లో చిరునవ్వులు పూయించి, మధ్య తరగతి జీవితాల్లో భార్యాభర్తల అనుబంధాన్ని కళ్లకు కట్టిన రచయిత మునిమాణిక్యం నరసింహారావు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో విద్యా ప్రసారాలు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పని చేశారు. అంధ్ర సార స్వత పరిషత్, తెలుగు పండిత శిక్షణ పాఠశాల హెడ్మాష్టర్ గా హైదరాబాదులో 5 ఏళ్ళు పని చేశారు.
హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులు హాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగు పాఠకులకు అందజేసే వారు.

మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దు కున్నారు. ముఖ్యంగా నోరి నరసింహశాస్త్రి, జరుక్ శాస్త్రులు వీరిని కథలు రాయమని ప్రోత్సహించారు. తను రోజు చెప్పే కబుర్లనే కథలుగా రాయమని తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి అనడంతో కథా రచనకు పూనుకున్నట్లు నరసింహారావే చెప్పుకున్నారు. కుటుంబ జీవితం లోని కష్టసుఖాలు, దాంపత్య జీవితం లోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఆయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యం లోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది. మరీ ముఖ్యంగా దంపతుల నడుమ జరిగే సున్నితమైన హాస్య శృంగార ఘట్టాలను అందించడంలో ఆయన అందె వేసిన చేయి.ముని మాణిక్యం నరసింహారావు తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడిలో మార్చి 15, 1898 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణ. ఆయన తెనాలిలో ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ చదవడానికి తాహతు లేకపోతే కొండా వెంకటప్పయ్య సహాయం వల్ల బి.ఎ చదివారు. ఆ తర్వాత గుంటూరు, భీమవరం, బందరు, కళాశాల్లో 30 ఏళ్ళు పని చేశారు. ఆదర్శ ఉపాద్యాయులుగా పేరు తెచ్చుకొన్నారు.

ఆయన భార్య కాంతం. ఆయనకు ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడిగా, ఆకాశ వాణిలో పని చేశారు. ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్ట మొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన రేడియో నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది.ఆయన ‘కాంతం కథల‘ కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతన మనిపిస్తాయి. మన హాస్యం పేరుతో ఆయన చక్కని గ్రంథం వెలువరించారు. వక్రరేఖ తిరుమాళిగ, దీక్షితులు కాంతం, నేను-మా కాంతం (1933), కాంతం కైఫీయత్, కాంతం కాపురం, మునిమాణిక్యం కథలు, రుక్కుత ల్లి- శరద్రాత్రులు, అన్నయ మంత్రి, మరపు, స్తుతి – ఆత్మస్తుతి, ఇల్లు – ఇల్లాలు, మంచివాళ్ళ మాట తీరులు, గాజుల పెట్టి, తల్లి ప్రేమ అయన రచనలలో ప్రసిద్ధం.

తిరుమాళిగ, దక్కుతల్లి , దీక్షితులు నవలికలు – కరుణరస భరితాలు. పిల్లలకు, విద్యార్థులకు సరిపడేలా అన్నయ మంత్రి, వక్రరేఖ నవలలను రచించారు. తిరుగుబాటు అనే నాటకం వ్రాశారు. మునిమాణిక్యం మొత్తంగా అరవై కథలు రాసినట్లు తెలుస్తుంది.ఇంటావిడతో పోట్లాట, ప్రణయ కలహం, భార్యను లొంగదీసు కోవడం ఎలా – వంటి రచనలు హాస్యస్ఫోరకాలు, మధ్యతరగతి సంసారాల దాంపత్య జీవిత రహస్యాలను ఆయన సజీవ పాత్రలుగా సృష్టించారు. తెలుగు సాహిత్యాన్ని తమ సునిశిత హాస్యం తో సుసంపన్నం చేసిన మునిమాణిక్యం ఫిబ్రవరి 4, 1973న మరణించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News