న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రం లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ప్రతి ప్రాజెక్టు కూడా నిర్ణీత సమయానికన్నా ముందే పూర్తవుతోందని అధికార బిజెపి తో పాటుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. తమ ప్రభుత్వం జాతీయ ర హదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ చెప్పుకొంటోంది. అయితే వాస్తవానికి కీ లకమైన రోడ్డు రవాణా, హైవేలు, రైల్వే లు, పెట్రోలియం రంగాలకు చెందిన వం దలాది ప్రాజెక్టులు అనుకున్న సమయానికంటే అనేక నెలలు ఆలస్యమవుతున్నాయని, వీటివల్ల తరువాయి 10లో
ఆయా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని ప్రభుత్వమే విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆలస్యమవుతున్న ప్రాజెక్టుల్లో రోడ్డు, రవాణా, హైవేల రంగం అగ్రస్థానంలో ఉంది. ఈ రంగంలో మొత్తం 749 ప్రాజెక్టులు చేపట్టగా వాటిలో 460 అంటే దాదాపు 60 శాతం ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి.
ఇక రైల్వేలో అయితే మొత్తం 173 ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే వీటిలో 117 ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. ఇక చివరగా పెట్రోలియం రంగంలో152 ప్రాజెక్టుల పనులు జరుగుతుండగా, వీటిలో 90 ప్రాజెక్టులు నిర్ణీత గడువుకన్నా ఆలస్యంగా నడుస్తున్నాయి. 2023 జనవరి నాటికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఫ్లాష్ రిపోర్టు ఈ వివరాలను వెల్లడించింది. రూ.150 కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం అయ్యే కేంద్ర ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల పనితీరును ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టు మానిటరింగ్ డివిజన్(ఐపిఎండి) పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను అమలు చేసే ఏజన్సీలు ఆన్‌లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్‌పై అందజేసిన వివరాల ఆధారంగా ఆ విభాగం ఈ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తుంది.
కేంద్ర గణాంకాలు, ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కిందికి ఈ ఐపిఎండి వస్తుంది.
కాగా తెలంగాణలోని మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైలు లైన్ ప్రాజెక్టు అన్నిటికన్నా ఎక్కువ ఆలస్యమైన ప్రాజెక్టుగా నిలిచిందని ఆ నివేదిక పేర్కొంది.ఈ ప్రాజెక్టు ఇప్పటికి 276 నెలలు అంటే 23 ఏళ్లు ఆలస్యమైంది. ఇక ఉధంపూర్ శ్రీనగర్‌బారాముల్లా రైలు ప్రాజెక్టు ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఆ ప్రాజెక్టు 247 నెలలు జాప్యమైంది. ముంబయి సబర్బన్ రైల్వే ప్రాజెక్టు విస్తరణలోభాగంగా చేపట్టిన బేలాపూర్‌సీవుడ్‌ఉరాన్ ఎలక్టిరఫైడ్ డబుల్ లైన్ నిర్మాణం ప్రాజెక్టు అత్యంత ఆలస్యమైన మూడో ప్రాజెక్టుగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ఇప్పటికి 228 నెలలు ఆలస్యమైంది. తాజా ఫ్లాష్ రిపోర్టులో రూ.150 కోట్లు అంతకన్నా ఎక్కువ వ్యయం చేసే 1,454 కేంద్ర రంగంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన వివరాలున్నాయి.
దాదాపు 871 ప్రాజెక్టుల పనులు వాటి ఒరిజినల్ షెడ్యూల్‌కన్నా ఆలస్యంంగా జరుగుతుండగా, 272 ప్రాజెక్టులు అవి పూర్తి చేయాల్సిన గడువుకన్నా ఆలస్యమయ్యాయని గత నెల విడుదల చేసిన ఈ నివేదిక వెల్లడించింది. ఈ 272 ప్రాజెక్టుల్లో రూ.1000 కోట్లు, అంతకు పైబడి వ్యయం అయ్యే 59 మెగా ప్రాజెక్టులు కూడా ఉండడం గమనార్హం.
ఇక రోడ్డు రవాణా, హైవేల రంగం విషయానికి వస్తే మొత్తం 749 ప్రాజెక్టుల అమలుకు అయ్యే ఖర్చు అవి మంజూరయినప్పుడు రూ.4,09,053.84 కోట్లని ఆ నివేదిక పేర్కొంది. అయితే వాస్తవానికి ఈ వ్యయం ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి రూ.4,27,518.41 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. అంటే అదనంగా 4.5 శాతం ఎక్కువ ఖర్చవుతుందన్న మాట. 2023 జనవరి వరకు ఈ ప్రాజెక్టులపై అయిన వ్యయం రూ.2,34,935.32 కోట్లుగా ఉంది.
అంటే ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 55 శాతం అన్న మాట. అలాగే 173 ప్రాజెక్టుల మొత్తం ఖర్చు అవి మంజూరయినప్పుడు రూ.3,72,761.45 కోట్లు కాగా దరిమిలా అది రూ.6,26,632.52 కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు. అంటే ముందు అనుకున్న దానికన్నా 68.1 శాతం ఖర్చుపెరుగుతుందన్న మాట. ఇక ఈ ఏడాది జనవరిదాకా ఈ ప్రాజెక్టులపై అయిన ఖర్చు రూ.3,72,172.64 కోట్లు. అంటే పెరిగిన అంచనా వ్యయంలో 59.4 శాతం అన్నమాట. ఇక పెట్రోలియం రంగం విషయానికి వస్త్తే 152 ప్రాజెక్టుల అమలుకు అయ్యే వ్యయం అవి మంజూరయినప్పుడు రూ.3,78,090.07 కోట్లు గా పేర్కొనగా, ఆలస్యం కారణంగా అది రూ.3,96,698.48 కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు. అంటే 4.9 శాతం వ్యయం పెరుగుతుందన్న మాట. కాగా ఈ ఏడాది జనవరి దాకా ఈ ప్రాజెక్టులపై అయిన వ్యయం రూ.1,49,364.38 కోట్లు అంటే 37.7 శాతమేనన్న మాట. ఈ లెక్కన ఈ మూడు రంగాల్లో ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే సరికి అవి మంజూరయినప్పుడు అంచనా వేసిన మొత్తంకన్నా ఎంత ఎక్కువ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి.