మునుగోడులో మూగపోయిన మైకులు
హోరెత్తిన ప్రచారపర్వానికి తెర
ఓటరు తుది తీర్పుకు సమయం ఆసన్నం
47 మంది అభ్యర్థులు..298 పోలింగ్ కేంద్రాలు
బయటవారు లేకుండా విస్తృత తనిఖీలు
నియోజకవర్గ సరిహద్దుల్లో చెక్ పోస్టులు
మనతెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను వేడెక్కించిన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ఇప్పటివరకు మోగిన మైకులు మూగపోయాయి. పార్టీలు, నేతల వాగ్భాణాలు, విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన ప్రచారపర్వానికి మంగళశారం సాయంత్రం 6 గంటలకు తెర పడింది. ఇక అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. పార్టీలు, నేతలు చేసిన విన్యాసాలకు ముగింపు పలుకుతూ ఓటర్లు తమ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందరి దృష్టి ఆకర్షిస్తోన్న ఉపఎన్నిక పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా మారిన ప్రలోభాలను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. నవంబర్ 3(గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 298 కేంద్రాల్లో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.
47 మంది అభ్యర్థులు
మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఇవిఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు 10 శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు.ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
మునుగోడు నియోజకవర్గంలో బయటవారు ఉండకుండా ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ఇతర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్ పోస్టులు చేశారు. ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం విధించడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుంది. సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 105 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల విధుల కోసం 3,366 మంది రాష్ట్ర పోలీసులను వినియోగించారు. 15 కంపెనీల కేంద్ర బలగాలు కూడా నియోజకవర్గానికి వచ్చాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మండలానికి రెండు చొప్పున 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 14 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, మరో 14 వీఎస్‌టీ బృందాలు పని చేయనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పర్యవేక్షణ కోసం 7 మండలాలు, 2 మున్సిపాల్టీలకు ఒకటి చొప్పున తొమ్మిది బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం 51 బృందాలు పర్యవేక్షణలో ఉండనున్నాయి. ప్రలోభాల పర్వాన్ని నిరోధించేందుకు ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఏడు మంది ఐటీ ఆధికారుల నేతృత్వంలో బృందాలు, జిఎస్‌టి బృందాలు మునుగోడులో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తనిఖీలు చేస్తున్నాయి. డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపిసిసెక్షన్ 171(బి) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అభ్యర్థిని లేదా ఓటరును లేదా మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్ 171(సి) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుంది.
Munugode by poll 2022 campaign ends