Sunday, December 22, 2024

పని చేసే పార్టీకే పట్టాభిషేకం

- Advertisement -
- Advertisement -

 

నెల రోజులకు పైగా మునుగోడులో అన్ని పార్టీలు మోహరించాయి. గెలుపే లక్ష్యంగా తమ సర్వశక్తులొడ్డి పోరాడాయి. ఎన్నికల ఫలితాలు టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య వున్నట్టు కనబడినా బిజెపికి పోలైన ఓట్లు రాజగోపాల రెడ్డి వ్యక్తిగత బలంపై వచ్చినవే కాని పార్టీకి వచ్చినవి కావు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని చెప్పుకుంటూ చేసిన ప్రచారం సత్యదూరమని ఈ ఎన్నికల ఫలితాలు తెలుపుతున్నాయి. బిజెపి, టిఆర్‌ఎస్‌కు ఎప్పటికీ ప్రత్నామ్నాయం కాదు.

అయితే గియితే తెలంగాణ కాంగ్రెస్ ఓట్లను చీల్చవచ్చు కాని టిఆర్‌ఎస్‌ను కదిలించ లేదు. దేశమంతటా బిజెపి కాంగ్రెస్‌ను బలహీనపరుస్తూ, పార్టీ మార్పిడులతో, విలువలు లేని రాజకీయాలతో అధికారంలోకి వస్తుంది తప్ప టిఆర్‌ఎస్, డియంకె, ఎఎపి, తృణమూల్ కాంగ్రెస్ లాంటి బలమైన నాయకత్వమున్న ప్రాంతీయ పార్టీలను కదిలించలేకపోతుంది. పేరుకు ప్రాంతీయ పార్టీయే అయినా జాతీయ ఎజెండాలో దేశానికి ఉదాహరణ ప్రాయమైన అభివృద్ధితో దూసుకెళుతున్నది. టిఆర్‌ఎస్‌ను బిజెపి ఎదుర్కోవడం అసాధ్యమన్న విషయం ఈ ఉపఎన్నిక రుజువు చేసింది.

మునుగోడు అసెంబ్లీ ఎన్నిక ఉప ఎన్నికే కావచ్చు కాని ప్రతి పార్టీ ప్రతిష్ఠాత్మకంగానే భావించింది. ఈ ఎన్నికలో టిఆర్‌ఎస్ గెలుపు కెసిఆర్ రాజకీయ చాణక్యానికి, వ్యూహ రచనకు మచ్చుతునక. భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వికాసాలకు పునాది రాయి లాంటిది. ఇదే వ్యూహాన్ని రాష్ట్రమంతటా అసెంబ్లీ ఎన్నికల్లో, దేశమంతటా పార్లమెంటు ఎన్నికల్లో అమలు చేస్తే మునుగోడు ఫలితాలే వస్తాయి. మునుగోడులో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా టిఆర్‌ఎస్‌పై ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసినా, ఎన్ని అభాండాలు మోపినా గెలువగలిగింది అంటే అది కెసిఆర్ పన్నినపని వ్యూహాల వల్లనే. శుష్క వాగ్దానాలు, సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, టిఆర్‌ఎస్ చేసిన పనులపై వ్యతిరేక ప్రచారం చేయడం లాంటివేవీ పని చేయలేదు.

సామాన్య ప్రజల ఆకలి దప్పులను తీర్చే పనులేమీ చేయకుండా, తమ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూపకుండా తెలంగాణలో ఏ అభివృద్ధి జరగడం లేదని గొంతెత్తి అరిస్తే అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్న ప్రజలెలా నమ్ముతారు? బిజెపి కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఏ ఆధారాలు లేని వ్యతిరేక ప్రచారం, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూస్తూ కూడా ఏమీ జరగడం లేదని బాకా ఊదితే ప్రజలెలా నమ్ముతారు? మరో దిక్కు టిఆర్‌ఎస్. ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరునూ కలుసుకొని వాళ్ళకందుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం, అందని వాళ్లెవరైనా ఉంటే అందచేద్దామని నమ్మకం కలిగించడం వల్ల బిజెపి చేసిన వ్యతిరేక ప్రచారం సత్యదూరమని ప్రజలకర్ధమైంది.

బిజెపి వేల కోట్లు ఖర్చుపెట్టి, కేంద్ర నాయకులతో ప్రభావితం చూపి ఇంటింటికీ కార్యకర్తలను పంపి అరచేతిలో వైకుంఠం చూపినా టిఆర్‌ఎస్‌కు రావాల్సిన మెజారిటీని కొంత తగ్గించగలిగారే కాని ఓడించలేక పోయారు. ఆ వచ్చిన ఓట్లూ పార్టీ మ్యానిఫెస్టోనో, వాళ్ళు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారన్న నమ్మకంతోనో వచ్చినవి కావు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత బలం వల్ల అక్కడే చాలా కాలంగా నాయకుడిగా ఉండటం వల్ల వచ్చినవి. దుబ్బాక, హుజూరాబాదు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినట్టేనని భావించడం ఆశాస్త్రీయ ఆలోచనా ధోరణి, స్వడబ్బా కొట్టుకోవడమే. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన నాగార్జున సాగర్, హుజూర్‌నగర్, ఇప్పటి మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఎంఎల్‌సి ఎన్నికలు, మునిసిపాలిటీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిట్లో టిఆర్‌ఎస్ సాధించిన ఘన విజయాలు బిజెపి, కాంగ్రెస్ కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయాయంటే టిఆర్‌ఎస్‌కున్న బలమేంటో అర్ధమవుతుంది.

బిజెపి ద్వేషం పునాదిగా టిఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకతను, సెంటిమెంట్లను రెచ్చగొడుతూ గెలువాలని చూస్తుంది. ప్రజలకు ఉపయోగపడే ఏ అభివృద్ధి నమూనా కాని, ఊపాధి కల్పనకాని, విద్య, వైద్య, వ్యవసాయాభివృద్ధి కాని చేద్దామన్న ధ్యాస బిజెపికి లేదు. ఇతర రాష్ట్రాల్లో చేసిన దాఖలాలు లేవు. పైగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలని ఎద్దేవా చేయడం, ప్రజలపై పన్నుల భారం, ధరల భారం పెంచడం. ఇవన్నీ చూసి చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లేస్తారు? మరో దిక్కు కాంగ్రెస్ తనను తాను ఏ మాత్రం అప్‌డేట్ చేసుకోకుండా టిఆర్‌ఎస్ వైఫల్యాలపై ఆధారపడి గెలవాలని ప్రయత్నించింది. అంతర్గత కలహాలతో, స్వపార్టీ వెన్నుపోట్లతో తనను తానే చంపుకుంటున్నది. కాంగ్రెస్ వారికి పార్టీ ప్రయోజనాల కన్నా స్వప్రయోజనలే, వ్యక్తిగత నాయకత్వ ప్రయోజనాలే ముఖ్యం. 67 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టిడిపి.లు నల్గొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ సమస్యను తీర్చలేకపోయాయి. టిఆర్‌ఎస్ మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యంతో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యకు తెరపడింది.

ఇప్పుడున్న ఫ్లోరైడ్ బాధితులు పాతవాళ్లే తప్ప ఈ మధ్య వచ్చిన వాళ్ళు కాదు. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ టిఆర్‌ఎస్ అభ్యర్ధులే గెలిచారు. మునుగోడు ఫలితం తెలంగాణ ప్రజలకు కెసిఆర్‌పై టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రేమాభిమానాలు ఏమాత్రం తగ్గలేదన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తన పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని అధికార పార్టీ ఎంఎల్‌ఎ లను వందల కోట్ల ఎర చూపి కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎంత అనైతిక చర్యో ప్రజలు గ్రహిస్తున్నారు. అనేక ఉద్యమాలు, పోరాటాల్లో ఆరితేరి ఉన్న తెలంగాణ ప్రజల చైతన్యం ముందు ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సాధ్యం కాదని తేలిపోయింది. దేశమంతా తెలంగాణ అభివృద్ధి నమూనాను అనుసరించాలని చూస్తుంటే తెలంగాణలో బిజెపి ఉపఎన్నికను సృష్టించి గందరగోళం చేయడం, ప్రజలపై వందల, వేల కోట్ల ఖర్చు భారం మోపడం ఏ సంస్కృతికి నిదర్శనం? ఏ విలువలకు ఆదర్శం? ఏదేమైనా శుష్క వాగ్దానాలు, అబద్ధపు ప్రచారాలు, రాష్ట్ర ప్రగతికి ఏమాత్రం ఉపయోగపడని ప్రసంగాలు, ప్రచార్భాటాలు, ద్వేషాన్ని పెంచే నెగటివ్ చర్యలేవీ ప్రజల హృదయాలను గెలుచుకోలేవని మునుగోడు చెబుతుంది.

ప్రజాభిప్రాయాన్ని, ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేయడం, డబ్బుతో గెలిచారనడం తాము పత్తిత్తులైనట్టు మాట్లాడడం ప్రజలకు తెలియంది కాదు. టిఆర్‌ఎస్ ఈ ఎనిమిదేండ్లలో సాగునీరు, తాగునీరు సమస్యతో పాటు వ్యవసాయాన్ని పండుగ చేయడం, వివిధ వృత్తి పనులవారి ఆదాయ వనరులు పెంచడం, రైతు బంధు, దళిత బంధు, వృద్ధాప్య పెన్షన్ లాంటి అద్భుతమైన సంక్షేమ పథకాలివ్వడం వల్ల కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. శాశ్వత ఓటు బ్యాంకును స్థిరపరుచుకుంది. ఇంగ్లీషు మాధ్యమం ద్వారా విద్య, ప్రభుత్వ దవాఖానాలను బాగు చేయడం ద్వారా వైద్యం, ఐటి విస్తారంగా పెంచడం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఉద్యోగాల కల్పన చేసి సబ్బండ వర్ణాలను ఆదుకుంటుంది.

టిఆర్‌ఎస్ ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రజలకు చేసిన పనులను ప్రతి ఓటరుతో పరామర్శించి, తట్టిలేపి గుర్తు చేయడం ద్వారా బిజెపి కాంగ్రెస్ అబద్ధ ప్రచారం దూది పింజల్లా ఎగిరిపోయింది. దశాబ్దాల తెలంగాణ అపరిష్కృత సమస్యలను పరిష్కారం చూపే పార్టీ టిఆర్‌ఎస్ మాత్రమేనన్న విశ్వాసం తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుంది, కాబట్టే మిగతా పార్టీల ఆటలు సాగడం లేదు. మునుగోడు ప్రజలు నిరంతరం తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తూ, అభివృద్ధి పథక రచన చేస్తున్న ‘పని చేసే ప్రభుత్వానికి పట్టం’ కట్టారన్నది వాస్తవం. 2023 డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నది జగమెరిగిన సత్యం.

డా॥కాలువ మల్లయ్య – 9182918567

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News