Friday, December 20, 2024

మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు

- Advertisement -
- Advertisement -

Munugode Returning Officer Dismissed by EC

మనతెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల గుర్తు విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి(ఆర్‌ఒ)పై వేటు వేసింది. ఎన్నికల గుర్తుల గందరగోళానికి ముగింపు పలికిన ఇసిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసీ పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ ఇసి నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో రిట్నరింగ్ అధికారి జగన్నాథ రావు తీరును తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఆర్‌ఒను మార్చాలని నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉపఎన్నికలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ గుర్తు మార్పు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రిటర్నింగ్ అధికారి తనకు లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తు మార్చారని ఆక్షేపించిన ఇసి.. విధి నిర్వహణలో తీవ్ర లోపం ఉన్నట్లు మండిపడింది. ఈ మేరకు ఆర్‌ఒను మార్చాలని నిర్ణయించింది. యుగతులసి పార్టీ అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా నివేదికలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించి, ఆ తర్వాత కనీసం ఎన్నికల పరిశీలకునికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా గుర్తు మార్చి బేబీవాకర్ ఇచ్చినట్లు తేల్చింది. గుర్తు మార్పు విషయమై సంబంధిత అభ్యర్థికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది.లేని అధికారాన్ని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి గుర్తు మార్చడం తగదని, ముందు కేటాయించిన రోడ్ రోలర్‌కు కొనసాగిస్తూ ఫారం 7ఎ ను సవరించాలని ఇసి ఆదేశించింది. సవరించిన ఫారం 7ఎను తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రచురించాలని, ఇసికి నివేదిక పంపాలని తెలిపింది. విధి నిర్వహణలో ఆర్‌ఒ లోపాలున్నాయని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం గుర్తుల కేటాయింపు వ్యవహారంలో మార్గదర్శకాలను పాటించలేదని ఆక్షేపించింది. గుర్తు మారుస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఇసి ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో శివకుమార్‌కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తూ ఫారం 7ఎను సవరించారు. గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించడంతో పాటు బ్యాలెట్ పత్రం ముద్రణకు కూడా ఉపక్రమించారు.
మునుగోడు ఆర్‌ఒగా మిర్యాలగూడ ఆర్‌డిఒ
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్‌డిఒ రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఆర్‌ఒ జగన్నాథ రావు స్థానంలో కొత్త ఆర్‌ఒ కోసం ముగ్గురు పేర్లను అధికారులు ప్రతిపాదించగా రోహిత్ సింగ్‌ను ఆర్‌ఒగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌ఒ జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

Munugode Returning Officer Dismissed by EC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News