Monday, December 23, 2024

దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం కోసం ఉద్యమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నూతన విద్యా విధానం రద్దు , దేశ వ్యాప్తంగా వికాలంగులకు ఒకే పెన్షన్ విధానం సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఎన్‌పిఆర్‌డి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ ప్రకటించారు. శనివారం ఎస్‌వికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 26 28 తేదీల్లో హైదరాబాద్‌లో సంఘం అఖిల భారత మూడవ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. గత 8 ఏళ్ళ కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వికలాంగుల హక్కులపై దాడి చేస్తోందని, వికలాంగుల చట్టాలను మార్చి ందని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు మొండి చెయ్యి చూపిస్తోందని విమర్శించారు. కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయడం లేదన్నారు.

యాక్సిసబుల్ ఇండియా సుగంధ్ భారత్ అభియాన్, దివ్యాంగ్ వంటి పేర్లతో వికలాంగులకు మోసం చేస్తోందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానం వికలాంగులను విద్యకు దూరం చేసేదిగా ఉందని దీని రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం నేషనల్ ట్రస్ట్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి వాటికి గత ఎనిమిదేళ్ళ నుండి చైర్మన్‌లను నియమించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తోందన్నారు. జీవిత అవసరాలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 26న ఇందిరా పార్క్ వద్ద సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి కాంతి గంగులి ముఖ్య అతిథిగా హజరవుతున్నారని తెలిపారు.
27న వికలాంగుల సాధికారతపై జాతీయ సదస్సు
డిసెంబర్ 27న వికలాంగుల విద్య ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారతపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్‌పిఆర్‌డి అఖిలభారత సహాయ కార్యదర్శి ఎం. అడివయ్య తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కేరళ రాష్ట్ర సోషల్ జస్టిస్ మంత్రి డా. ఆర్. బిందు, తెలంగాణ వికలాంగుల కొ ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డా. వాసుదేవ రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, కోశాధికారి ఆర్. వెంకటేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News