Monday, December 23, 2024

పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటన

- Advertisement -
- Advertisement -

చంద్రగిరి ఎంఎల్‌ఎ పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో 37వ నిందితుడైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై చంద్రగిరి ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ముందస్తు ప్రణాళికతో సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేందర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు. ఈ కేసులో కుట్రదారులు ఎవరనే విషయం పోలీసు శాఖకు అప్పట్లో తెలిసినా కేసు నమోదుకు వెనుకంజ వేశారు. బాధితులు వీడియో సాక్షాలు అందజేసినా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పులివర్తి నానీ న్యాయపోరాటం సైతం చేశారు. సార్వత్రిక ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తారుమారవ్వడంతో పోలీసులు కుట్రదారులపై దృష్టిపెట్టారు. ఇటీవల 37వ నిందితుడిగా చంద్రగిరి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. మోహిత్‌రెడ్డి బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్న తిరుపతి పోలీసులు శనివారం అక్కడికి వెళ్లి అదుపులోనికి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News