మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోసారి ‘హత్యాయత్నం’ జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై ‘బాంబు దాడి’ జరిగినట్లు జనరల్ జివిఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం నుంచి పుతిన్ సురక్షితంగా బయటపడ్డారంటూ కూడా పేర్కొంది. పుతిన్ నివాసానికి తిరిగొస్తుండగా ఆయన కారు ఎడమ చక్రం భారీ శబ్దంతో పేలిందని టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. అప్రమత్తమైన సిబ్బంది అధ్యక్షుడి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపింది. ఈ ఘటనలో పుతిన్‌కు ఎలాంటి హానీ జరగలేదు. ఈ ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. అధ్యక్షుడి భద్రతా లోపానికి కారణమైన సెక్యూరిటీ సర్వీసెస్‌కు చెందిన పలువురు అధికారులను అరెస్టు చేసినట్లు కూడా ఆ ఛానెల్ తెలిపింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టినప్పటి నుంచి పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఈ దాడి జరిగి ఉండొచ్చని మీడియా కథనాలు. గతంలో కూడా పుతిన్‌ను చంపేందుకు ఐదుసార్లు హత్యాయత్నాలు జరిగాయని ఓ సందర్భంలో పుతినే స్వయంగా తెలిపారు.