గంజాయి, మారణాయుదాలు స్వాధీనం
మన తెలంగాణ/సూర్యాపేట : పట్టణంలోని సీతారాంపురం కాలనీలో రౌడీ షీటర్ ఇంట్లో గంజాయి కల్గిన ముగ్గురు వ్యక్తులు ఉన్నా సమాచారం టౌన్ సిఐ ఆంజనేయులు వారి సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం లింగంపల్లి సుధాకర్, లింగంపల్లి సంజయ్,అలువాల వెంకట స్వామి, పోతురాజు సైదులు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారి వద్ద నుండి రెండు కెజిల గంజాయి, రెండు వేట కొడవళ్లు, కంకి కొడవలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరస్తులను విచారించగా అర్వపల్లి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన యాదవ కులస్తుడైన దావుల వీరప్రసాద్ ముదిరాజ్ కులానికి చెందిన లింగంపల్లి జగన్నాధం రెండవ భార్య కూతురు మనీషాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
వీరప్రసాద్ భార్యను ఎంపీపీగా గెలిపించుకున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్నాధం అనారోగ్యంతో చనిపోగా తలకొరివి పెట్టే విషయంలో అందరూ జగన్నాధం పెద్ద భార్య కుమార్తె కవితతో తలకొరివి పెట్టించాలని అనుకోగా దావుల వీరప్రసాద్ రెండవ భార్య కుమార్తె అయినటువంటి శ్వేతతో తలకొరివి పెట్టించినాడని,అప్పటి నుండి జగన్నాధం అన్న కుమారుడు లింగంపల్లి సుధాకర్, అతని బంధువులకు, వీరప్రసాద్‌లకు మనస్పర్ధనలు వచ్చి గొడవలు జరుగుతున్నవి. దావుల వీరప్రసాద్ తరచుగా జగన్నాధం కుటుంబం విషయంలో తలదూర్చుతుండేవాడు అనే నెపంతో గత కొద్ది రోజుల క్రితం జగన్నాధం పెద్ద భార్య అల్లుడు జిన్నే శ్రీను, అతని కుమారుడు అశ్విన్‌లపై మా గ్రామస్తుడైన మేకల సంతోష్‌ను కొట్టిన విషయంలో దావుల వీరప్రసాద్ జిన్నే శ్రీను, అతని కుమారుడు అశ్విన్‌లపై లేనిపోని తప్పుడు కేసులు పెట్టించినాడని, అలాగే గ్రామంలో అలాగే, లింగంపల్లి సంజయ్ అనే అతని మూడు గుంటల భూమి పంచాయతీ దావుల వీరప్రసాద్ తలదూర్చి, అతనికి మూడు గుంటల భూమి రాకుండా అడ్డుపడినాడు అని అనుమానం ఉంది.
మూసీ మాజీ ఛైర్మన్ అలువాల వెంకట స్వామి ఇంటిపై కూడా బండి సంజయ్ వారి గ్రామానికి వచ్చిన సమయంలో దావుల వీరప్రసాద్ అనుచరులు గొడవ చేసినారు. ఇలా ప్రతి విషయంలో దావుల వీరప్రసాద్ అడ్డుపడుతున్నాడు అనే అనుమానంతో జగన్నాధం అన్న కుమారుడు లింగంపల్లి సుధాకర్, జిన్నె శ్రీను, అలువాల వెంకటస్వామిలు కలిసి దావుల వీరప్రసాద్‌ను ఎలాగైనా చంపాలని, కిరాయి హత్యలు చేసే అలవాటు ఉన్న, వారి బంధువైన సూర్యాపేటకు చెందిన పూణెలో ఉంటున్న లింగంపల్లి సంజయ్, రౌడీ షీటర్ అయినటువంటి పోతురాజు సైదులుకు చెప్పగా సరే అన్నందున, అలాగే జిన్నె శ్రీను కూడా జైల్‌కు వెళ్లే ముందు సుధాకర్ వెంకటస్వామిలతో వీరప్రసాద్‌గాడిని చంపండి నేను జైలు నుండి వచ్చిన తర్వాత ఎంత ఖర్చైన పెట్టుకుంటా అని అన్నాడని, గత 22న జనగాం చౌరస్తాలో ఉన్నటువంటి కాకతీయ బార్‌లో సుధాకర్, వెంకటస్వామి, పోతురాజు సైదులు, సంజయ్‌లు మందు తాగుతూ దావుల వీరప్రసాద్‌ను ఎలా చంపాలో చర్చించుకొని తర్వాత సూర్యాపేట పట్టణంలో ప్లై ఓవర్ పక్కన గల ఇనుప పనిముట్లు తయారు చేసే బీటు కమ్మరోళ్ల దగ్గర రెండు కత్తులు, రెండు వేట కొడవళ్లు కొని అవకాశం కోసం ఎదురుచూస్తూ పట్టుబడినట్లు తెలిపారు.
సంజయ్ అనే నిందితునికి గత నేర చరిత్ర ఉంది. 2013లో ఉప్పల్‌లో ఒక హత్య కేసు, చైతన్యపురిలో వ్యబిచార గృహ నిర్వహణ కేసు, కేతేపల్లి, సూర్యాపేటలో దాడి చేసిన కేసులు కలవు. ఇతనిపై రెండు అరెస్టు వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇతను ఆన్‌లైన్ వ్యభిచారం చేయించుచున్నాడు. ఇతనికి వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, పూణె, నాగపూర్‌లో ఉన్న వ్యభిచార ఏజెంట్‌లతో వాట్సాప్‌ల ద్వారా సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. పోతురాజు సైదులు అనే నిందితునిపై కూడా 2010లో సూర్యాపేట పట్టణంలో ఒక వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో అరెస్టు అయినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయబడి ఉందని తెలిపారు. సమాచారం సేకరించి ఛేదించి అరెస్టులో చాక చక్యంగా వ్యవహరించిన టౌన్ సిఐ ఆంజనేయులు, ఎస్సై శ్రీనివాస్, చివ్వెంల ఎస్సై విష్ణు, ఐటి కోర్ ఎస్సై శివ కుమార్, క్రైమ్ స్టాఫ్ కృష్ణ, కరుణాకర్, సైదులు, మల్లెష్‌లను అభినందించి రివార్డులు ప్రకటించారు.