Monday, January 20, 2025

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య… 15 ఏళ్ల తరువాత కీలక తీర్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌ను హత్య, దోపిడీ అభియోగాల కింద దోషులుగా విచారించగా, వారికి సాయం చేసిన అభియోగాలపై అజయ్ సేఠీని దోషిగా ప్రకటించింది. వీరికి త్వరలోనే శిక్ష ఖరారు చేయనుంది.

ఓ టీవీ ఛానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్ పదిహేనేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. 2008 సెప్టెంబరు 30న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా, వసంత్ విహార్ ప్రాంతంలో ఆమె కారును నిందితులు అడ్డగించి దోపిడీకి ప్రయత్నించారు. ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఉదయానికి కారులో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్‌లకు సమాచారం అందించారు. తొలుత ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని పోలీస్‌లు అనుమానించారు.

అయితే పోస్ట్‌మార్ట్ రిపోర్టులో ఆమె తలకు బుల్లెట్ గాయమైనట్టు తేలడంతో హత్యగా నిర్ధారించారు. అనంతరం సిసిటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఆమె కారును మరో వాహనం అనుసరించినట్టు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీస్‌లు 2009 లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దోపిడీ కోసమే ఈ హత్య జరిగినట్టు పోలీస్‌లు వెల్లడించారు. అప్పటినుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. తాజాగా నిందితులందరినీ దోషులుగా తేల్చుతూ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News