Monday, December 23, 2024

ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర.. రివ్వాలర్, కత్తి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Murder Plan on TRS MLA Jeevan Reddy

ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర
పోలీసుల అదుపులో సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్
నిందితుని నుంచి రివ్వాలర్, కత్తి స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమూరి ఎన్‌క్లేవ్‌లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన హత్యకు మంగళవారం కుట్ర జరిగింది. ఎంఎల్‌ఎ హత్యకు కుట్ర చేసిన నిందితుడు ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్‌గా గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ప్రసాద్ గౌడ్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డిపై కక్ష పెంచుకుని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఈక్రమంలో జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఉదయం ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎంఎల్‌ఎ ఇంట్లో పనిచేస్తున్న భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈక్రమంలో నిందితుని నుంచి కత్తి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎంఎల్‌ఎ హత్యకు జరిగిన కుట్రపై అన్ని కోణాలలో విచారణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి నుంచి కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించడంతో పాటు సిసి ఫుటేజ్‌లో రికార్డ్ అయిన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్మూర్‌లోని ఎంఎల్‌ఎ నివాసం వద్ద రెండు రోజులుగా ప్రసాద్ గౌడ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న సిసిటివి పుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
విభేదాలపై విచారణ ః
కిల్లెడ సర్పంచ్‌గా గెలిచిన లావణ్య భర్త ప్రసాద్‌గౌడ్‌కి జీవన్ రెడ్డి మధ్య సంవత్సర కాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలలో బిజెపి తరపున ప్రసాద్ భార్య లావణ్య గెలిచినప్పటికీ కొద్దికాలం తరువాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరి పనిచేస్తూ వచ్చారు. ఈక్రమంలో ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి ఎన్నికలలో ఓడిపోయిన వాళ్లకు మద్దతు ఇవ్వడం , బిల్లులు ఆపించడంతో ఇద్దరి మధ్య వివాదాలు ముదిరాయి. ఈక్రమంలో ఎంఎల్‌ఎను ప్రసాద్‌గౌడ్ బెదిరించటం కోసం వచ్చాడా ? లేక హత్య చేసేందుకు వచ్చాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
నేపాల్ టూర్‌పై ః
నిందితుడు ప్రసాద్‌గౌడ్ నాలుగు రోజుల క్రితమే నేపాల్ వెళ్లి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నేపాల్‌లో పిస్టల్ కొనుగోలు చేయడంతో పాటు అక్కడ సుపారీ గ్యాంగ్ ను కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెపన్ డీలర్లతో ప్రసాద్ సంభాషణలు పలు మీడియాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ ఖబడ్ధార్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి అంటూ చేసిన హెచ్చరికలపై విచారణ సాగిస్తున్నారు. ఎంఎల్‌ఎ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతోనే హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు తెలుస్తోందని పోలీసులు వివరిస్తున్నారు.
ఎంఎల్‌ఎ రమ్మంటేనే వెళ్లాడు ః సర్పంచ్ లావణ్య
ప్రసాద్ గౌడ్‌పై హత్యారోపణలపై కిల్లెడ సర్పంచ్ లావణ్య స్పందిస్తూ తన భర్తకు ఎంఎల్‌ఎను హత్య చేసే ఉద్దేశం లేదని, ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి హైదరాబాద్ రమ్మంటేనే వెళ్లాడని స్పష్టం చేశారు. ఎంఎల్‌ఎ కావాలని పిలిపించి కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. కిల్లెడ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు ఇవ్వడం లేదని, బిజెపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరినా బిల్లులు ఇవ్వకపోవడంతో పాటు సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయించారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై ఎంఎల్‌ఎను ఇటీవల తామిద్దరం కలిశామని, ఇప్పుడు హత్యాయత్నం కింద తన భర్తను ఇరికించడం సరికాదని ఆవేదన వక్తం చేశారు.ఎంఎల్‌ఎతో తమకు గొడవ జరిగిందని, అప్పటినుంచే ఆయన మాపై కక్ష పెంచుకున్నారని చెప్పారు. కిల్లెడలో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.18 లక్షల బిల్లులు ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి నిలిపివేశారని ఆరోపించారు.

Murder Plan on TRS MLA Jeevan Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News