బిజెపిపై మేధా పట్కర్ విమర్శ
కోల్‌కత: దేశంలో అత్యధికంగా ఉన్న గిరిజనుల ఓట్లను పొందేందుకే గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి నిలిపిందని సామాజిక కార్యకర్త మేధా పట్కర్ విమర్శించారు. ముందు నుంచి బిజెపి ఆదివాసీ అనుకూల పార్టీ కాదని ఆమె తెలిపారు. గురువారం ఒక వార్తాసంస్థకు టెలిఫోన్ ద్వారా ఆమె ఇంటర్వూ ఇచ్చారు. తన సొంత గ్రామానికే విద్యుత్‌ను తీసుకురాలేని ముర్ము కాని ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన ఉమ్మడి అభ్యర్థి ఆర్థికవేత్త యశ్వంత్ సిన్హా రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఏం చేయగలరని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతి పదవి అధికార పార్టీకి రబ్బరు స్టాంపుగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. మధ్యప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలలో ఆదివాసీల జనాభా అత్యధికంగా ఉందని తెలిసే బిజెపి గిరిజన మహిళను రాష్ట్రపతిగా అభ్యర్థిగా నిలపడంతోపాటు బిర్సా ముండా జయంతిని నిర్వహిస్తోందని మేధా పట్కర్ విమర్శించారు. ఒక పక్క అటవీ హక్కులను ఆదివాసీలకు అందచేయకుండా, మరోపక్క అడవులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ తమది ఆదివాసీల అనుకూల పార్టీ అని బిజెపి ఎలా చెప్పుకోగదలని ఆమె ప్రశ్నించారు.