Friday, January 24, 2025

నేటితో ముగియనున్న ‘ముస్కాన్’

- Advertisement -
- Advertisement -

ఆగస్టు నుండి ‘ ఆపరేషన్ స్మైల్’ కు కార్మిక శాఖ కసరత్తు
మగ్గిపోతున్న వేలాది మంది పిల్లలకు ఏటా విముక్తి
ముస్కాన్, స్మైల్‌తో రేపటి తరానికి భవిత

హైదరాబాద్ : బాలకార్మికులను వివిధ పనుల నుండి విముక్తి చేసేందుకు తెలంగాణ కార్మిక శాఖ ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఏటా రెండు దఫాలుగా ఆపరేషన్ ముస్కాన్.. ఆపరేషన్ స్మైల్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. జనవరి నుండి ఆగస్టు వరకు ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహిస్తుండగా.. ఆగస్టు నుండి ఏడాది ముగిసే డిసెంబర్ వరకు ఆపరేషన్ స్మైల్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నేటితో ఆగస్టు మాసం ముగియనుండడంతో 9వ విడత ఆపరేషన్ ముస్కాన్‌కు తెరపడనుంది. ఈ సారి ఎంత మందిని రక్షించామన్న దానిపై అధికారులు గణాంకాలను జిల్లాల నుండి తెప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కనీసం 350 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు అధికార వర్గాలు చెబుతున్నారు.
రేపటి తరానికి భవిత…
పాఠశాలల్లో ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించాల్సిన ఆ చిన్నారులు.. పంటచేలలో , పరిశ్రమల్లో దుకాణాల్లో కూలీలుగా మారుతున్నారని, పాఠాలు చదవాల్సిన రేపటి తరం.. అలా పనుల్లో కనిపించొద్దని తెలంగాణ రాష్ట్ర సర్కార్ చెబుతోంది. భవిష్యత్ బాలలదేనని, పిల్లలంతా బడుల్లోనే కనిపించాలని ఆపరేషన్ ముస్కాన్’, ఆపరేషన్ స్మైల్ ని అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, పిల్లలను పనుల్లో పెట్టుకున్న యాజమాన్యాలపై కేసులు నమోదు చేయిస్తోంది. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్..ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో కార్మిక శాఖతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ, పోలీసులు, చైల్ వెల్ఫేర్ తో పాటు.. ఎన్జీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయా బృందాలు పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి 18 ఏళ్ల లోపు బాల కార్మికులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. అనంతరం తల్లిదండ్రులకు బాలలకు అవగాహన కల్పించి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు 326 మంది బాలకార్మికులను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించారు. అలాగే బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై అధికారులు లేబర్ ఆక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు సంబంధించిన బాల కార్మికులు ఉంటే వారికి ఇక్కడే చదువు చెప్పించడం లేదా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి రాష్ట్రంలో చదువుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. గుర్తించిన బాల కార్మికులకు సంబంధించి పాఠశాలల్లో చేర్పించి అనంతరం వారిని అలాగే వదిలేయకుండా తల్లిదండ్రులతో బడులకు పంపేందుకు అంగీకార పత్రాలు సైతం రాయించుకుంటున్నారు.
2018లో 3470 మంది పట్టివేత ..
2018 సంవత్సరంలో 5వ విడత ఆపరేషన్ ముస్కాన్‌నే తీసుకంటే ఆ సంవత్సరం జులై నెలలోనే తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 3,470 మంది పిల్లలను రక్షించారు. వారిలో 72 శాతం మంది పిల్లలు కూలీ పనుల నుండి రక్షించబడగా, మిగిలిన వారు భిక్షాటన నుండి రక్షించబడ్డారు. పట్టణ ప్రాంతాల్లో కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే బాలకార్మికులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఈ విషయమై ఎంత చెప్పిన పట్టించుకోక పోవడంతో కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ , పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ముస్కాన్..స్మైల్‌లలో రెండు సార్లు ఏదో ఒక నెలలో అందరూ కలిసి దీనిని పకడ్బందీగా చేపట్టనున్నారు. కాగా ఇతర శాఖలతో సంబంధం లేకుండా కూడా కార్మిక శాఖ తన వంతుగా ప్రతి నెలా స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News