Monday, December 23, 2024

మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తి
గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మూసీనది
సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నాం
గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాం
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని, అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఫతుల్లగూడ, – ఫీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి కెటిఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కెటిఆర్ ఉప్పల్ శిల్పారామం వద్ద 5 మూసీ వంతెనలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే రూ.152 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుగుతున్న మూసారాంబాగ్-, అంబర్‌పేట మూసీ వంతెనలకు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మూసీ పరిరక్షణలో భాగంగా ఇవాళ కీలకమైన రోజు అని, హైదరాబాద్ మహా నగరానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నదిగా మూసీనది ఉండేదని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మూసీనది మురికి కూపంగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూసీ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు.

శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా ఈ బ్రిడ్జిల నిర్మాణం
మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని, నిధులు పెరిగినా పరవాలేదని, హైదరాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండేలా ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతామన్నారు. 2 వేల మిలియన్ లీటర్స్ ఫర్ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని ఆయన తెలిపారు. దుర్గం చెరువు వద్ద 7 ఎంఎల్డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించామని, ఎస్టీపీలు పూర్తయితే మూసీలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్థితి నెలకొంటుందన్నారు. మంచిరేవుల -ఘట్‌కేసర్ వరకు మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సిఎం కలను నెరవేరుస్తామన్నారు.

ఒక్కోక్కటిగా సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నామన్నారు. మూసారాంబాగ్‌లో 2020లో వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి గుర్తు చేశారు. కరోనా కారణంగా కొన్ని పనులను చేయలేకపోయామని, 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలని ఎస్టీపీలను నిర్మిస్తున్నామని కెటిఆర్ చెప్పారు. దుర్గం చెరువుపై నిర్మించిన వంతెన కంటే అందమైన వంతెనలను నిర్మిస్తామని కెటిఆర్ పేర్కొన్నారు.160 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీనది మీదుగా వెళ్లే విధంగా ఈ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందన్నారు. రూ. 5 వేల కోట్లతో రెండో విడత ఎస్‌ఎన్డీపీ తొందరలోనే చేపడుతామని, జీఓ 118లోని చిన్న చిన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని కెటిఆర్ పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధిని సాధించామని, ఇప్పటికే 30 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేసుకున్నామని, త్వరలోనే మరో 40 వేల ఇళ్లను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News