Saturday, November 16, 2024

లక్షాన్ని భంగపడనివ్వద్దు

- Advertisement -
- Advertisement -

చెరువులు, నాలాలు, మూసీనది, వాటితోపాటు మొత్తం రాష్ట్రంలోని జలాశయాలు, నదులు, అదే విధంగా యావత్ పర్యావరణ పరిరక్షణ అన్నది నిస్సందేహంగా ఒక గొప్ప లక్షం. అయితే ఆ లక్షాన్ని సక్రమమైన, సమగ్రమైన ప్రణాళికలు, వాటి సమర్థవంతమైన అమలు ద్వారా వాంఛనీయమైన విధంగా సాధిస్తారా లేక వీటికి భిన్నంగా వ్యవహరిస్తూ తామే భంగపరచుకుంటారా అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. లక్షాన్ని సాధిస్తే తెలంగాణకు గొప్ప మేలు చేసినవారవుతారు. ప్రస్తుతానికే కాదు, దీర్ఘకాలం పాటు. లేనట్లయితే రాష్ట్రానికి మేలు జరగకపోవటం అట్లుంచి, తమకు తాము ఊహించని నష్టాలు చేసుకుంటారు.

నిజానికి ఇటువంటి మాటలన్నీ అనవలసిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే, పార్టీలు మారినా ప్రభుత్వం అన్నది ఒక సుస్థిర వ్యవస్థ. జీవనది వలే కొనసాగుతూనే ఉంటుంది. సులభమైన భాషలో చెప్పాలంటే, ప్రభుత్వ వ్యవస్థకు సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది. విషయాలు తెలిసి, అనుభవం కూడా ఉన్న నాయకులు, అధికారులు, యంత్రాంగంలోని సిబ్బంది ఉంటారు. అది గాక ఇతరుల అనుభవాలు, అధ్యయనాల నుంచి తెలుసుకునే అవకశం ఉంటుంది. అటువంటప్పుడు లక్షశుద్ధి, చిత్తశుద్ధి రెండూ ఉన్నట్లయితే అనుకున్నదంతా లేదా చెప్తున్నదంతా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగాలి. కాని, దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్‌ఆర్) పరిధిలో మొదటి దశగా చేపట్టిన చెరువులు, నాలాలు, మూసీనది పరిరక్షణ శుద్ధి, అభివృద్ధి ప్రణాళిక ఆ పద్ధతిలో జరగడం లేదు. సరికదా, ఆరంభ దశలోనే సామాన్య ప్రజల మొదలుకొని ఆలోచనాపరులు, న్యాయస్థానాలు, మీడి యా, రాజకీయ పార్టీల వరకు అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నది. ఆఖరుకు, అధికార పక్షమైన కాంగ్రెస్ నుంచే అసమ్మతి స్వరాలు వినవస్తుండగా, ఈ మంగళవారం నాడు సాక్షాత్తూ పార్టీ అధిష్ఠానం ఈ పద్ధతి తగదంటూ సూచించిందని వార్తలు వెలువడ్డాయి.

దీనంతటికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. గమనించదగినదేమంటే లక్షం ఎంత మంచిదో ప్రభుత్వ పథకానికి సానుకూలత కూడా సామాన్య ప్రజలతో సహా అన్ని వైపుల నుంచి మొదట అదే విధంగా వ్యక్తమైంది. పైగా జలాశయాల పరిరక్షణ ఆలోచనలు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా చేస్తున్నవి కాకపోగా గత ప్రభుత్వాలు సైతం చేసినవే. వారపుడు వాస్తవంగా అమలు చేసి ఉంటే ఏ విధంగా చేసేవారో, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సమస్యలకు ఆస్కారం ఇచ్చేవారో కాదో తెలియదు. జరగలేదు గనుక చెప్పలేము. దానినట్లుంచి, మొత్తానికి అన్ని సానుకూలతలు, అందుకు తోడుగా పలు పర్యావరణ పరిరక్షణ చట్టాలు, అనుకూలమైన కోర్టు తీర్పులూ ఉన్న స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముందు నుంచి తగు సన్నద్ధతలు చేసుకుని, ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా అమలు చేయటం మొదలుపెడితే ఈ సమస్యలన్నీ రాకపోయేవి.

అన్ని సమస్యలలోకి తీవ్రమైనది, ఇందులో ప్రభుత్వ నాయకత్వపు నిజమైన ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ కాదని, పైకి ఆ మాట చెప్తున్నా దాని మాటున మరేవో ఉద్దేశాలున్నాయనే అనుమానాలు కలగటం. అటువంటివేమీ లేవనుకున్నా, తన పొరపాట్లు, తొందరపాట్ల ద్వారా అందుకు ఆస్కారం కల్పించింది మాత్రం ప్రభుత్వమే.
సాధారణంగా భారీ పథకాలపై కొంత కాలం గడిచిన తర్వాత నీలినీడలు కమ్ముకుంటుంటాయి. రకరకాల కారణాల వల్ల వేర్వేరు కోణాల నుంచి కాని, హైడ్రా కార్యక్రమం తొలి దశలోనే, రెండు నెలలు గడిచే సరికే, ఈ ప్రశ్నలను ఎదుర్కోవలసి రావడం ప్రభుత్వ లక్షానికి మేలు చేసేది కాదు. హైడ్రాతో పాటు ప్రభుత్వం కూడా ఇప్పటికే చాలా అప్రతిష్ఠపాలై, ఇంకా అవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ స్థితికి చేరిందంటే అధికారులు, ప్రభుత్వం, అధికార పక్షం ఎన్ని వివరణలిచ్చినా, ఎటువంటి ఎదురు వాదనలు చేసినా ప్రజాభిప్రాయం సాధారణ స్థితికి రాగలగడం కష్టంగా కనిపిస్తున్నది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ బాధ్యులు, అధికార పక్షం వారు కొందరు సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి బదులు, తమ విమర్శకులపై ఎదురు దాడులు చేస్తున్నారు.

అందువల్ల ప్రజల దృష్టిలో వ్యతిరేకత ఇంకా పెరుగుతున్నది. అర్థం చేసుకోవలసిందేమంటే ప్రతిపక్షాలను, ఇతర విమర్శకులను అట్లుంచి ఇప్పుడు ప్రజాభిప్రాయమే అతి పెద్ద ప్రతిపక్షంగా మారింది. దానిని ఆధారం చేసుకునే ప్రతిపక్షాలు విమర్శించగలుగుతున్నాయి. ప్రజలలో సానుకూలత ఉంటే ప్రతిపక్షాలు గాని, ఇతర విమర్శకులు గాని, చివరకు కోర్టులు గాని అనగలిగింది ఏమీ ఉండదు కదా. ప్రభుత్వం, అధికార పక్షం జాగ్రత్తగా గ్రహించవలసిన సూక్ష్మం ఇది. తన పద్ధతులు మార్చుకునేందుకు ప్రభుత్వానికి ఇపుడొక మంచి అవకాశం లభించింది. తొలి యుద్ధంలో దెబ్బలు తిన్న తర్వాత గాయాలకు చికిత్స చేసుకుంటూ, జరిగిన పోరును సమీక్షించుకుని, మలి యుద్ధానికి సిద్ధమయేందుకు లభించే విశ్రాంతి సమయం వంటిది ఇది. తొలి యుద్ధంలో ప్రభుత్వానికీ, అధికారులకూ ప్రజల నుంచి, పార్టీల నుంచి, ఆలోచనాపరుల నుంచి, మీడియా నుంచి, కోర్టు నుంచి, ఇంకా ఇతరత్రా కూడా గాయాలు తగినన్ని అయ్యాయి. ఆ కారణంగా వారిపుడు తమ ప్రణాళికా రాహిత్యానికి, వివిధ శాఖల మధ్య సమన్వయత లేమికి, సమగ్ర దృష్టి లేనితనానికి, పొరపాట్లకు, తొందరపాట్లకు ప్రజల ముందు, కోర్టు ఎదుట సంజాయిషీలు చెప్పుకుని సవరణలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి అది మంచి పని. వారినందుకు మెచ్చుకోవాలి. తప్పులు, మార్పులు ఎప్పుడైనా, ఎవరికైనా సహజం కదా. కనుక, ఈ విరామ కాలంలో వారినాపని చేసుకోనిద్దాం. ఆ తర్వాత తమ పనిని సవ్యంగా చేయనిద్దాం.

అయితే, ప్రభుత్వమే ప్రకటించిన లక్షాలను బట్టి చూడగా, ఈ విశ్రాంతి సమయంలో చేయవలసిన పనుల జాబితా సుదీర్ఘంగా కనిపిస్తున్నది. వాస్తవానికి ఈ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు మూడు నెలల క్రితం హైడ్రా మాటను ప్రకటించడానికి ముందే చేయవలసింది. అనుభవం, వివేకం గల ఏ ప్రభుత్వమైనా చేసే పని అది. కాని అట్లా జరగలేదు. కనీసం ప్రకటన తర్వాతనైనా ఆ పని జరగటం లేదు. సరే, ఆ మాటను పక్కన ఉంచి ఇప్పుడు చేయవలసిందేమిటో చూద్దాం. ఈ ఆలోచన మొదటి ఒఆర్‌ఆర్ పరిధిలో సవ్యంగా, విజయవంతంగా జరిగితే తప్ప, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) వరకు, మొత్తం రాష్ట్రానికి వర్తింప చేయటం కష్టమవుతుంది గనుక, ఇప్పుడు జరగవలసిందేమిటో చూసి ఆ ప్రకారం చేయటం, మౌలిక లక్షం భంగపడకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరం.
మొదటి చేయవలసింది అన్ని సమాచారాలు పూర్తిగా సేకరించడం.

చెరువులు, నాలాలు, ఇతర జలాశయాలు, మొత్తం 55 కిలోమీటర్ల మూసీ నది, ఆ తర్వాత కొంత ప్రాంతానికి కూడా నిమిత్తం ఉందని పర్యావరణ నిపుణులు చెప్తున్నందున ఆ మేరకు సైతం సమస్త సమాచారాన్ని సిద్ధం చేసుకోవటం. ఆ లెక్కలు, కొలతల తర్వాత దేని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్, ఆ పరిధిని దాటి కూడా కొన్ని మీటర్ల మినహాయింపు ఉంటుందనే మాట వినవస్తున్నది. గనుక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనేది. అందుకు సంబంధించిన మ్యాపులు, శాటిలైట్ చిత్రాలు, వేర్వేరు ప్రభుత్వ సంస్థల వద్ద గల వేర్వేరు మ్యాపులు, వాటి మధ్య గల తేడాలు, వాటిని ప్రమాణీకరించటం. అట్లాగే సహజ క్రమంలో వానలు, వరదల వల్ల హద్దులు మారినవి. చివరగా తుది మ్యాపుల ప్రకారం నేలపై హద్దులు పాతటం. ఆ వెనుక అన్నింటికి చివరి రూపంలో నోటిఫికేషన్లు ఇవ్వటం. అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి అవసరమైన సవరణలు చేసుకోవటం. ఈ పనులు ఇంత వరకు జరగలేదని స్వయంగా అధికారులు బయట గాని, కోర్టు ఎదుటగాని చెప్తున్న మాటలు రుజువు చేస్తున్నాయి. ఇది చాలా విచారకరమైన, ప్రమాదకరం కూడా అయిన స్థితి. అంతకన్న ముఖ్యంగా అది అసలు లక్షాన్నే దెబ్బ తీయగలదు. ఎందుకో బహుశా చెప్పనక్కర లేదు.

సరైన మ్యాపులు, హద్దులు లేకుండా ఏ పనీ సవ్యంగా సాగదు. అందువల్ల, మొదట ఆ పని జరిగిన వెనుక ఆ మ్యాపుల లెక్కల ప్రకారం అన్ని రకాల ఆక్రమణల లెక్కలు తీయాలి. పట్టాలు, లీజులు ఏవి. వ్యక్తులవి, సంస్థలవి, ప్రభుత్వానివి, సహకార గృహ నిర్మాణ సంస్థలవి, బిల్డర్లవి, రాజకీయవాదులవి, ప్రభుత్వాలే పథకాల కింద పేదలకు ఇచ్చినవి మొదలైనవి. అందులో రకరకాలుగా చేతులు మారినవి. క్రమబద్ధీకరణలు జరిగినవి. ఈ పని జరిగిన తర్వాత, చట్ట విరుద్ధమనే ఆయా భూములకు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులెవరు, ఒకరి పేరిట రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా మరొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వారెవరు (ఇటువంటి కేసుల బాధితులు వేలకువేలున్నారు), లే ఔట్లకు అనుమతులిచ్చిందెవరు, నిర్మాణాలకు అనుమతులెవరివి, అటువంటి అక్రమ నిర్మాణాలకు వివిధ పౌర వసతులు కల్పించిందెవరు, వాటిన్నింటివి రుసుములు ఎట్లా, ఎవరు వసూలు చేశారన్నది అపుడు తేల్చాలి.

ఇటువంటి పనులు చేసిన అధికారులందరిపై ముందు చర్యలు తీసుకోవాలి. వారి వసూళ్ల సొమ్మునంతా లెక్కలు గట్టి వారి నుంచి వసూలు చేయటమో, ప్రభుత్వమే తిరిగి చెల్లించేందుకు సిద్ధపడటమో ముందు జరగాలి. ఆ వెనుక, ఆ ప్రజలలో ధనికులు, మధ్య తరగతి వారు, పేదలు, సొంత ఇళ్లవారు, కిరాయిదారులు, శాశ్వత నివాసాల వారు, తాత్కాలిక షెడ్లు, గుడిసెలవారు, ఒకే ఇంటిలో నివసించే పలు కుటుంబాల వారు, నివాసాల వారు, షెడ్లలో చిన్న వ్యాపారాల పేదలు, ఎక్కడ ఎవరు ఎంతెంత కాలంగా నివసిస్తున్నారు, పని పాటలు చేసుకంటున్నారు, చదువుతున్నారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు మొదలైన సర్వ సమగ్ర సమాచార సేకరణ జరగాలి. వారిని తొలగిస్తే భూమికి, నిర్మాణాలకు, తాత్కాలిక షెడ్లకు పరిహారాలేమిటో తేల్చాలి. అందుకు బాధితులను ఒప్పించాలి. వారికి ప్రత్యామ్నాయాలు చూపి అందుకు కూడా ఒప్పించాలి.

పిల్లలను విద్యా సంస్థల విషయంలో ఒప్పించాలి. పేదలకు ఉపాధి చూపాలి. తొలగింపులో ధనిక పేద తారతమ్యాలు ఉండరాదు. ఇది ఒకటైతే, ఆక్రమణల తొలగింపు తర్వాత ఏయే జలాశయాలను ఏ విధంగా పునరుద్ధరిస్తారో ప్రణాళికలు రూపొందించి అది కూడా పారదర్శకంగా, ప్రజాస్వామికంగా ప్రజలకు ప్రకటించాలి. మూసీకి ఇంత వరకు లేని డిపిఆర్ వగైరాలు తయారు చేసి వెల్లడించాలి. ఇదంతా ఎందుకంటే అంతిమంగా ఈ రాష్ట్రం, ఈ సహజ వనరులు ప్రజలవే తప్ప పాలకులవి కావు గదా. ఈ కార్యక్రమం అనేక సంవత్సరాల పాటు సాగి, ప్రజలపై రాష్ట్రంపై గణనీయ ప్రభావాలు చూపగలదు గనుక, ఇందువల్ల కలిగే మంచి భంగపడకూడదంటే ఇదంతా తప్పనిసరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News