Wednesday, January 22, 2025

యూపికి వెళ్లే రైలులో ముస్లిం వ్యక్తిపై దౌర్జన్యం!

- Advertisement -
- Advertisement -

హాపూర్: ఢిల్లీ నుంచి మొరాదాబాద్‌కు పద్మావత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మధ్యవయస్కుడైన ముస్లిం వ్యక్తిపై దౌర్జన్యం జరిగింది. నడుం వరకు ఉన్న అతడి దుస్తులను తొలగించారు. బెల్టుతో బాదారు. అంతేకాక ‘జై శ్రీరామ్’ అని చెప్పమని బలవంతపెట్టారు. ఇదంతా హిందూ తీవ్రవాదుల గ్రూప్ చేసిందని భావిస్తున్నారు. బాధితుడు అసీమ్ హుసైన్ కథనం ప్రకారం కొందరు హాపూర్ స్టేషన్‌లో రైలులోకి ఎక్కారు. ‘ రైలులో చాలా జనం. హఠాత్తుగా 8 నుంచి 10 మంది వాతావరణాన్ని మార్చేశారు. కొందరు వెనుక నుంచి ‘యే ముల్లా చోర్ హై’(ఇతడు దొంగ)’ అన్నారని హుసైన్ విలేకరులతో అన్నారు. ముస్లింలను హేళన చేసి మాట్లాడేప్పుడు ‘ముల్లా’ అంటుంటారు.

‘ఆ వెంటనే కొందరు కొట్టడం మొదలెట్టారు. వారు నా గడ్డం లాగారు. ఈ ముల్లాలంతా ఇలాగే ఉంటారు అన్నారు. తర్వాత వారు నన్ను ‘జై శ్రీరామ్’ అన మన్నారు. కానీ నేను అందుకు నిరాకరించాను’ అని హుసైన్ తెలిపాడు. హుసైన్ వారిని పట్టించుకోకపోవడంతో వారు అతడి పై దుస్తులను తీయించేశారు. కింద పడుకోబెట్టారు. తర్వాత బెల్టుతో నిర్ధాక్షిణ్యంగా కొట్టారు. ‘వారు ఎంతలా కొట్టారంటే నాకు స్పృహ పోయేంతగా. ఆ తర్వాత వారిలోనే కొందరు నాపై కరుణ చూపారు. మొరాదాబాద్ స్టేషన్ రాగానే నన్ను బయటికి తోసేసారు. ఆ తర్వాత స్టేషనులో ఎవరో నాకు దుస్తులు ఇచ్చారు’ అని హుసైన్ తెలిపాడు.

‘కొట్టిన వారిని గుర్తుపడతావా?’ అని అడిగినప్పుడు, అతడు ‘గుర్తుపట్టలేను’ అన్నాడు. జనంలో ఎవరూ తనని కాపాడే ప్రయత్నం చేయలేదని కూడా అతడు తెలిపాడు. ఇప్పుడు హుసైన్‌పై జరిగిన దాడి వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుండగా ఈ ఉదంతంపై ఇద్దరిపై చర్య తీసుకున్నట్లు మొరాదాబాద్ రైల్వే పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘తోటి ప్రయాణికుల నుంచి సమాచారం తీసుకున్నాక, వైరల్ వీడియో ఆధారంగా, ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకున్నాము. వారు బరేలి రైల్వే జంక్షన్‌లో దిగారు’ అని ఆ పోలీస్ అధికారి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News