అత్యవసర విచారణపై పరిశీలన
న్యూఢిల్లీ : వక్ఫ్ (సవరణ) చట్టం 2025కు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సవరణల రాజ్యాంగ బద్థతను బోర్డు సోమవారం సవాలు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం , రాష్ట్రపతి ఆమోదం , చట్టం అయిన నేపథ్యంలో ఈ విషయం ఇప్పుడు కోర్టు వ్యాజ్యానికి దారితీసింది. పర్సనల్ లాబోర్డు పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించేందుకు అన్ని విషయాలు పరిశీలిస్తామని ఉదయం ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.
జమాయిత్ ఉలామా ఇ హింద్, మజ్లిస్ నేత, ఎంపి అసదుద్దిన్ ఒవైసి , కాంగ్రెస్ ఎంపి మెహమ్మద్ జావెద్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇతరుల పిటిషన్లు కూడా ధర్మాసనం పరిశీలనకు వచ్చాయి. తాము సవరణ బిల్లును సవాలు చేసిన విషయాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి ఎస్‌క్యూఆర్ ఇల్యాస్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. చేపట్టిన సవరణలు రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ఓ వర్గం అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగపు ఆర్టికల్ 25, 26 ల పరిధిలో సంక్రమించే ప్రాధమిక హక్కుల ఉల్లంఘనగా ఉన్నాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా మొత్తం వక్ఫ్ నిర్వహణను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ముస్లిం మైనార్టీలను వారి సొంత మత పరమైన ధార్మిక విషయాలలో కూడా దూరం పెట్టేలా చేశారని విమర్శించారు. ముస్లిం వర్గాలు తమ మత స్వేచ్ఛను నిర్వహించుకునేవీలు లేకుండా చేసేశారని స్పందించారు.సవరణల విషయాలో ముస్లిం లా బోర్టు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు, మతపరమైన సంస్థల హక్కులను కాలరాచేలా సవరణలు చేశారని తెలిపారు. పలు మత వర్గాలకు ఉండే నియంత్రణను ముస్లిం వక్ష్‌కు నిరాకరించినట్లు అయిందని ముస్లిం లా బోర్డు స్పందించింది.