ప్రవక్తపై వ్యాఖ్యలతో పలు నగరాల్లో ఉద్రిక్తతలు
నూపుర్,
అరెస్టుకు పట్టు
నమాజ్‌ల
తరువాత నిరసన
ప్రదర్శనలు
కశ్మీర్, రాంచీలో
కర్ఫూ, జవాన్లపై
రాళ్లు యుపిలో
పలు నగరాల్లో
తీవ్రస్థాయి
ఘర్షణలు
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై బిజెపి ప్రతినిధుల వ్యాఖ్యలతో ఇప్పుడు దేశంలో కొలిమంటుకొంటోంది. దేశంలోని పలు నగరాలలో అధికార పార్టీ ప్రతినిధుల దురుసుతనంపై మండిపడుతూ శుక్రవారం భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లను వెంటనే అరెస్టు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రదర్శనలతో పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢిల్లీ, రాంచీ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నగరాలలో జనం నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మతపరంగా ఓ వర్గానికి కీలకమైన రోజు కావడంతో ఇదే రోజు నిరసనలు చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది. బిజెపి అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, జిందాల్‌లను పార్టీ నుంచి తీసివేశారు. అయితే వారిపై మరింత కఠి న చర్యలు అవసరం అని, ప్రవక్తను నిం దిస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రఖ్యాత జమా మసీదు వె లుపల నిరసనలకు దిగారు. దేశంలో అ తి పెద్ద మసీదుల్లో ఇది ఒక్కటి. శుక్రవారం నాటి నమాజుల తరువాత వెలుపల పెద్దఎత్తున జనం గుమికూడారు. దీనితో శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులకు సవాలు పరిస్థితి ఏర్పడింది. ఓ గంటపాటు ప్రదర్శన చేసిన తరువాత నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపొయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఇక్కడ జరగలేదు. అయితే ఉద్రిక్తత చాలా సేపు అలుముకుంది. తాము నిరసనలకు పిలుపు నివ్వలేదని జమా మసీదు షాహీ ఇమామ్ తెలిపారు. అయితే నమాజుల తరువాత బయటకు వెళ్లిన వారిలో కొందరు నినాదాలకు దిగారని, అక్కడ జనం గుమికూడారని వివరించారు. కొద్ది సేపటితరువాత జనం అక్కడి నుంచి వెళ్లారని ప్రదర్శనలకు ఎవరు దిగారనేది తాము చెప్పలేమన్నారు. పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు.
యుపి సహ్రాన్‌పూర్, మొరాదాబాద్, ప్రయాగ్‌రాజ్‌లలో
ప్రవక్తపై వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రధాన నగరాలలో నిరసనలు చెలరేగాయి. ప్రత్యేకించి సహ్రాన్‌పూర్, మొరాదాబాద్, ప్రయాగరాజ్ (ఇంతకు ముందటి అలహాబాద్)లలో వందలాది మందితో ప్రదర్శనలు సాగాయి. ఇక లక్నో, కాన్పూర్, ఫిరోజాబాద్‌లలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సమూహాలు నిరసనలు చేపట్టాయి. ప్రవక్తపై నిరసనలకు వ్యతిరేకంగా గత వారం కాన్పూర్‌లో తీవ్రస్థాయి ఘర్షణలు చెలరేగా యి. ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతోంది. తిరిగి శుక్రవారం తిరిగి నిరసనలు చెలరేగడంతో అధికారులు కలవరం చెందారు. సహ్రాన్‌పూర్‌లో అనధికారికంగా గుమికూడినందుకు పోలీసులు 21 మందిని అరెస్టు చేశారని, మసీ దు వెలుపల వీరిని అదుపులోకి తీసుకున్నారని జిల్లా పోలీసు అధికారి ఆకాశ్ తోమర్ తెలిపారు. ఇక్కడ పలు ప్రాంతాలలో దుకాణాలను బలవంతంగా మూసివేయించిన ఘటనలు టీవీలలో ప్రసారంఅయ్యాయి. పలు చోట్ల బైక్‌లను పడదోయడం వంటి ఘటనలు జరిగాయి.
అలహాబాద్‌లో రాళ్లు..
యుపిలోని అత్యంత కీలకమైన నగరం అలహాబాద్‌లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నమాజుల తరువాత కొందరు రాదారులపై నిలబడి రాళ్లు రువ్వారు. నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు యత్నించారు. ఓ ప్రాంతంలో నిరసనకారులను చెదరగొట్టేందకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. రాళ్లు రువ్వుతున్న వారిని చెదరగొట్టేందుకు ఈ విధంగా చర్యకు దిగాల్సి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఉద్రిక్తత కొనసాగుతోంది.
రాంచీలో పోలీసులకు గాయాలు
జార్ఖండ్‌లోని రాంచీలో ఓ గుంపు దేవాలయం వెలుపల గుమికూడింది. వారు అరాచకానికి దిగే అవకాశాలు ఉండటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. వీరితో జనం తలపడిన దశలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఓ దశలో గాలిలోకి కాల్పులు జరిపారు.jఇక్కడ కర్ఫూ విధించారు. కొల్‌కతాలోని పార్క్ సర్కస్ ప్రాంతంలో , హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద, లూధియానాలో, అహ్మదాబాద్‌లో శుక్రవారం ప్రార్థనల తరువాత జనం గుమికూడారు. నినాదాలకు దిగుతూ ప్రదర్శనలు నిర్వహించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. బిజెపి అధికార ప్రతినిధులు ఇద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే పశ్చిమాసియాకు చెందిన పలు ఇస్లామిక్ దేశాలలో భారత్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇది సమసిపోయేందుకు భారత ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాలలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడం కలవర కారకం అయింది. మత విద్వేషకర వ్యాఖ్యలకు దిగిన వారి పట్ల కఠిన చర్యలకు దిగుతూ ఒక్కరోజు క్రితమే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ ఎంపి అసద్దుద్దిన్ ఒవైసీ, బిజెపి మాజీ ప్రతినిధులు, జర్నలిస్టు సబా నక్వీ పలువురిపై కేసులు దాఖలకు చర్యలు తీసుకున్నారు.
కశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలలో కర్ఫూ
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు నిరసనగా జమ్మూ , కశ్మీర్ ప్రాంతాలలో నిర్వహించిన ప్రదర్శనలతో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జమ్మూ ప్రాంతంలోభదేర్వా, కిష్టావార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తలు చెలరేగాయి. ఇక కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో హర్తాళ్ జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా పలు చోట్ల అధికారులు కర్ఫూ విధించారు. శ్రీనగర్ ఇతర నగరాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాలలో రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. ఆంక్షలను ఉల్లంఘిస్తూ జనం గుంపులుగా బయలుదేరారు. వీధులలోకి రావడం, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఘటనలతో పరిస్థితి చేజారే ముప్పు ఏర్పడింది. అయితే తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచే జమ్మూ ప్రాంతంలో కొన్ని చోట్ల జనం గుమికూడటంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది. ఇక్కడి దోడాలో వందలాది మంది భైఠాయింపులకు దిగారు.
ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. తరువాత అధికారులు నచ్చచెప్పడంతో రోడ్లపై నుంచి జనం వైదొలిగారు. ఈ దశలో సామాజిక మాధ్యమాలలో పలు తీవ్రస్థాయి వ్యాఖ్యలు వెలువడటం, దూషణ ప్రసంగాలు విన్పించడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. దోడాలో ఇద్దరు మహిళలు తమపై భద్రతా బలగాలు దౌర్జన్యానికి దిగాయని ఆరోపించారు. దీనితో పలు చోట్ల అర్థరాత్రి నుంచే నిరసనలు చెలరేగాయి. ఈ మహిళలు అక్కడి మసీదు నుంచి వెలుపలికి వచ్చి మీడియాతో మాట్లాడారు. కర్ఫూ అమలులో ఉన్న ఈ పట్టణంలో జనం గుమికూడి పోలీసులపై రాళ్లురువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించారు. పలు ప్రాంతాలలో భారీ స్థాయిలో భద్రతా బలగాలను బందోబస్తుకు దింపారు. ఇక కశ్మీర్‌లోని శ్రీనగర్ లోయలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో దుకాణాలను మూసివేశారు.