న్యూఢిల్లీ: కేంద్రం అమలులోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితమైందని ఆక్షేపించింది. దీని అమలుకు విరామం ఇవ్వాలంటూ మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2019లో కూడా సీఏఏను సవాలు చేస్తూ ఐయూఎంఎల్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడంతో ఆ చట్టం అమలులోకి రాదని అప్పట్లో కేంద్రం కోర్టుకు వెల్లడించింది.
తాజాగా నిబంధనలు నోటిఫై చేయడంతో మళ్లీ ఆ అంశం కోర్టుకు చేరింది. ఆ చట్టం రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు దాని అమలుపై స్టే విధించాలంటూ తన పిటిషన్‌లో కోరింది. 2019లోనే సీఎఎ చట్టానికి పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి సమ్మతి లభించినప్పటికీ విపక్షాల ఆందోళనలు, దేశ వ్యాప్త నిరసనలతో దాని అమలులో జాప్యం జరిగింది.
పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమలు లోకి తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టే ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు దీనిని తీసుకు వచ్చారు. కొందరిపై వివక్ష చూపేలా ఉంటే దీనిని అమలు చేయబోమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఇదే తరహా ప్రకటన చేశారు.