Wednesday, January 22, 2025

ముస్లిం మహిళలూ భరణానికి అర్హులే

- Advertisement -
- Advertisement -

తీవ్రంగా ప్రభావితం చేసే ఒక తీర్పులో సుప్రీం కోర్టు సిఆర్‌పిసి సెక్షన్ 125 కింద ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చునని స్పష్టం చేసింది. ‘మత తటస్థ’ నిబంధన మతంతో ప్రమేయం లేకుండా వివాహిత మహిళలు అందరికీ వర్తిస్తుందని కోర్టు తెలియజేసింది. 1986 ముస్లిం మహిళల (విడాకులపై హక్కుల పరిరక్షణ) చట్టానికి సెక్యులర్ చట్టంపై ఆధిపత్యం లేదని న్యాయమూర్తులు బివి నాగరత్న, అగస్టిన్ జార్జి మసీహ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. భరణం అనేది వితరణ కాదని, కానీ వివాహిత మహిళల అందరి హక్కు అని బెంచ్ స్పష్టం చేసింది. ‘సెక్షన్ 125 మహిళలు అందరికీ వర్తిస్తుందనే ప్రధాన నిర్ణయంతో క్రిమినల్ అప్పీల్‌ను మేము ఇందుమూలంగా కొట్టివేస్తున్నాం’ అని జస్టిస్ నాగరత్న తీర్పు వెలువరిస్తూ తెలియజేశారు. ఇద్దరు న్యాయమూర్తులు విడివిడిగానే అయినా ఏకీభవించే తీర్పులు వెలువరించారు. భరణం కోసం ఒక భార్య హక్కును సూచించే పూర్వపు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 125 ముస్లిం మహిళలు అందరికీ వర్తిస్తుందని బెంచ్ తెలిపింది.

సర్వోన్నత న్యాయస్ధానం మహమ్మద్ అబ్దుల్ సమద్ పిటిషన్‌ను కొట్టివేసింది. భరణం మంజూరు చేస్తూ కుటుంబ న్యాయస్థానంజారీ చేసిన ఉత్తర్వు విషయంలో జోక్యానికి నిరాకరించిన తెలంగాణ హైకోర్టు తీర్పును సమద్ సవాల్ చేశారు. విడాకులు పొందిన ముస్లిం మహిళకు సిఆర్‌పిసి సెక్షన్ 125 కింద భరణానికి అర్హత లేదని, 1986 చట్టం నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సమద్ వాదించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాసిమ్ ఖాద్రి వాదనను విన్న అనంతరం బెంచ్ తన తీర్పును ఫిబ్రవరి 19న రిజర్వ్ చేసింది. సిఆర్‌పిసి సెక్షన్ 125తో పోలిస్తే 1986 చట్టం ముస్లిం మహిలకు మరింత ప్రయోజనకారి అని ఖాద్రి వాదించారు. సమద్ తాను విడాకులు ఇచ్చిన భార్యకు మధ్యంతర భరణం చెల్లించాలన్న కుటుంబ న్యాయస్థానం ఆదేశాన్ని హైకోర్టు నిరుడు డిసెంబర్ 13న తోసిరాజనలేదు. కానీ పిటిషన్ తేదీ నుంచి చెల్లించవలసిన మొత్తాన్ని నెలకు రూ. 20 వేల నుంచి రూ. 10 వేలకు హైకోర్టు తగ్గించింది.

తాము 2017లో పర్సనల్ చట్టాల ప్రకారం విడాకులు పొందామని, ఆ మేరకు విడాకుల సర్టిఫికేట్ కూడా ఉందని, కానీ దానిని కుటుంబ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకుండా మధ్యంతర భరణం చెల్లించాలని ఆదేశించిందని సమద్ హైకోర్టు ముందు వాదించారు. హైకోర్టు ఉత్తర్వుతో విభేదించిన సమద్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News