Friday, November 22, 2024

ముస్లిం మహిళల జీవన వేదన

- Advertisement -
- Advertisement -

తెలుగు సాహిత్యంలో అందునా కవిత్వంలో కొత్త గొంతులు, కొత్త వస్తువులు, కొత్త జీవితాలు, కొత్త పదాలు, కొత్త వ్యథలు ప్రవేశించడానికి అస్తిత్వ ఉద్యమాలు ఒక కారణం. ఇంతవరకు తెలీని ఎన్నో చీకటి కోణాలను అది చర్చకు పెట్టింది.ఎవరూ ఇంతవరకు మాట్లాడని అంశాలను ముందుకు తెచ్చింది.పురుషుడే భూమికగా ఇన్నినాళ్లు నడచిన ఉద్యమాల్లో స్త్రీల గొంతుకలు వినపడ్డాయి. స్త్రీలు ఎలుగెత్తిన అంశాల పట్ల తీవ్ర చర్చ జరిగింది.ఆధునిక సమాజంలో స్త్రీల వేదనలు, అసమానతలు,కుటుంబ సమస్యలు,సామాజిక సమస్యలు,ఇంటి పని విభజన, పిల్లల బాధ్యతలు, ఉద్యోగ సమస్యలు,ఆరోగ్య సమస్యలు ఇలా అనేక సమ్యలు కవితా వస్తువులు అయ్యాయి. ప్రసూతి నొప్పుల నుండి పైటను తగలెయ్యడం దాకా తెలుగు కవిత్వం విస్తరించింది.’నీలి మేఘాలు’గా తెలుగు నాట ఒక కొత్త ఒరవడికి తెర లేపింది.స్త్రీ వాద ఉద్యమాలు కూడా ఒక దశలో ఉవ్వెత్తున ఎగిసాయి.స్త్రీ కేంద్రంగా ఎన్నో విషయాలు పునర్లిఖించబడ్డాయి.స్త్రీ వాదపు వెలుగులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సమయంలో ఉప్పెనలా వచ్చిన దళిత,

స్త్రీ వాద ఉద్యమాల నేపథ్యంలో స్త్రీలందరూ ఒకటి కాదు.స్త్రీల సమస్యలు అన్నీ ఒకటి కావు అనే ఒక వాదన ముందుకొచ్చింది.ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లో దళితుడు దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంటే దళిత స్త్రీ దళిత పురుషుడికి బానిసగా అత్యంత దుర్లభ జీవితం గడుపుతోంది అని దళిత స్త్రీ వాదులు తెగేసి చెప్పి, పేదల కుటుంబాల్లో ఇంటిని,శ్రమని సమంగా పంచుకునే శ్రామిక దళిత మహిళే అసలైన ఫెమినిస్ట్ అని తేల్చారు. ఇది ఇలా వుంటే..ఈ దేశంలో రెండో తరగతి పౌరులుగా,అనుమానితులుగా ,టెర్రరిస్టులుగా…ఇంకా రకరకాలుగా అణచివేతకు గురవుతున్న ముస్లిములు జీవనం చర్చకు వచ్చినప్పుడు తెలుగు సాహిత్యంలో నమోదయిన అనేక ముస్లిమ్ కథలు పాఠకులను విస్మయపరచాయి.అంతవరకు గుంభనంగా వున్న సగటు ముస్లిముల సాధకబాధకాలు ఒక్కొక్కటిగా బయటకు రాసాగాయి.ఈ సందర్భంలో కథలు వచ్చినంత విరివిగా కవిత్వం రాలేదు.తర్వాత వచ్చినా ముస్లిం పురుషుల నుంచి వచ్చినంతగా ముస్లిమ్ స్త్రీల నుండి రాలేదు.
ఇటీవల కాలంలో ఏర్పడిన పరిస్థితులు వల్ల ఐతేనేమి, చదువుకున్న ముస్లిం స్త్రీల చైతన్యం వల్ల ఐతేనేమి …కొన్ని ముస్లిమ్ స్త్రీల గొంతుకలు తెలుగు కవిత్వంలో తమ గొంతు విప్పి

,తమ అంతరంగ వేదనను అక్షరబద్ధం చేస్తున్నాయి.ముస్లిమ్ స్త్రీల ఆవేదనను బలంగా ముందుకు తెచ్చిన తాజా స్వరం నస్రీన్ ఖాన్ ’ జఖ్మి ’ ఈ పుస్తకంలో నస్రీన్ ముస్లిం స్త్రీల అంతరంగంలో, కౌటుంబిక జీవితాల్లో, సామాజిక జీవితాల్లో, మతం పేర అణచివేయబడుతున్న ఆచారాల్లో నలిగిపోతున్న వైనం ఆవేదనతో చెప్పింది.
ముందుగా కళ్లపడేది అమ్మ కష్టమే కాబట్టి మెదటి కవిత అమ్మ కుటుంబం కోసం పడే అగచాట్లు ’ అమ్మీ’వ జయతే కవిత అయుంది.ఇళ్లల్లో అమ్మలు పడే దినసరి శ్రమను ఎలా వర్ణిస్తుందో చూడండి. ‘ దెహ్లీజ్ ( గడప ) కు ఆవలే తజ్బీ( జపమాల )/ చదివినంత వేగంగా/ పనిలో నిమగ్నమైన మా అమ్మీలను చూడండి./ అబ్బాల హుకుం లను అక్షరాల పాటించే అమ్మీలు/ అనుక్షణం అందరి ఆజ్ఞలు పొల్లు పోనీయని అమ్మీలు/ ఏ ఒక్కరి పసంద్ ను బేఖాతిర్ ( లెక్కచెయ్యని )చెయ్యని /మెమరీ చిప్ లు మా అమ్మీలు/ పగలంతా పట్టెడన్నం కోసమే శ్రమించే పుట్టలోపలి చీమలు /వున్నంతలో కాళ్లు ముడుచుకొనే/ అపురూప అంతఃసౌందర్యవతులు..‘ అంటూ ఇళ్లల్లో అమ్మల పరిస్తితులు ఏకరువు పెడుతూ ..ఇంకా ఇలా అంటుంది.

‘ తాగుబోతు అబ్బాలు వున్న ఇంటి పరదాలను/ ఒకసారి జరిపి చూడండి./ కంటికి నిదుర అంటని అమ్మీలు కనిపిస్తారు./ సంప్రదాయాల్లో ఒదిగి ఏ టైలరింగ్ చేస్తూనో,/ ఏ ఎంబ్రాయిడరీ వర్క్ లోనో మరే చోటనో /ఇంటి బరువును మొగ్రా మాలగా సూదిలోకి/ గుచ్చడంలో నిమగ్నమైన దిగులుకళ్ల అమ్మీలకు కొదవే/ లేదు‘ అంటుంది.నిజంగానే పరదాల వెనుక ఏ దుఃఖం తెరలుతెరలుగా గడ్డ కట్టి అమ్మీల రూపంలో వుంటుందో పరదాలు తొలగించి చూస్తేగానీ తెలియదు.ఏ పేద ఇంటివాడి పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏం వుండదు.కాకపోతే ముస్లింల స్త్రీల జీవితాలు పరదాల వెనుకే మగ్గి పోతుంటాయి.దిగులు కళ్ల అమ్మీలు అన్నప్పుడు కనపడే దృశ్యచిత్రం దిగులు పుట్టిస్తుంది.అడుగడుగునా ముస్లింల జీవన విధానాన్ని,వారి శ్తమని, వారి నిబద్ధత ని , వారి నిజాయితీ ని, పేదరికాన్ని అడుగడునా వర్ణిస్తుంది అనేక కవితల్లో…/ ఆత్మీయ ఆలింగనాల ముసల్మానులకు/ హత్తుకునే మాట ఒకటి చాలు./ ‘ చిరునవ్వుల అలాయ్ బలాయ్ లకు ఆవల/ అర్థరాత్రులలో ఇంద్రధనస్సులు వెలిగించే/ దావత్ ల పరదాల వెనుక/ తారసపడిన ప్రతి ఘటనా బాధాతప్తమే/ మనసుతో వినగలిగితే…‘/ ‘ గొంతు పెగలని అభిమాన కథలున్నాయ్/ పస్తులున్న కడివెడు కహానీలున్నాయ్‘/ ‘

గడప అంచు దాటని దిగుళ్లన్నింటిని/ హసీన్ ( అందమైన ) ముస్కురాహట్ ( చిరునవ్వు ) లోకి మార్చిన నైపుణ్యం వారి సొంతం ‘/ ‘ గొంతు పెగలని దుఃఖాన్ని / తమలోనే సమాధి చేసుకున్న పసందైన కథలు/ మనసును మెలిపెట్టి / కన్నీటి చెలిమెలు సృష్టించే కథలు/ గుండెను చెవిని చేసి / ఒకసారి వినండి.‘ అంటుంది శ్రోతలు కావాలి కవితలో.
ఒక ముసల్మాను లోపల ఎలా వుంటాడో..ఎంత హృదయమిస్తాడో..ఎన్ని బాధల్ని మనసులోనే దాచిపెట్టి పైకి చిరునవ్వుతాడో ..వచ్చి వినగలిగితే గుండెను మనసు చేసుకొని , మనసుతో వినినప్పుడే ఆ కన్నీటి చెలిమెలు అర్థమవుతాయి అని చెపుతుంది./ ‘ స్నేహ మాధుర్యాన్ని పెంచే దోస్తొకడుంటాడు./ పాన్ షాపు నడుపుతూ వుండొచ్చు./ మీ జిందగీలలో మెహందీతో మెరుగులు దిద్దొచ్చు./ ఏ టూ వీలర్ కో పంక్చర్లు చేస్తూనో/ పూట గడుపుతుండొచ్చు.
ఒకసారి అడిగి చూడండి./ కమ్మని మీ ప్రేమని పంచి చూడండి. ‘అన్నప్పుడు/ ఒక ముస్లిం ఈ సమాజంలో ఎంతగా కుంచించుకుపోయి వుంటాడో..ఎంత న్యూనతా భావంతో చేతనైన చిన్నచిన్న పనులు చేసుకు బతుకుతుంటారో చెపుతుంది.

కమ్మని ప్రేమకు కరిగి అతను మీ ముందు తన తఖ్లీఫ్ లన్నీ జంఖానా పరిచినట్టు పరుస్తాడు అంటుంది.కించిత్ ప్రేమకు కరిగిపోయే అమాయకులు వాళ్లు అంటుంది. తమ బతుకల్లో అలుముకున్న అంథకారానికి ఒక్క రాత్రి మాత్రమే ఓదార్పు…ఆ రాత్రి ఒడిలో సేదతీరి తమ బాధలను దాచుకునే రాత్రి మా జిగ్రీ దోస్త్ అంటూ ‘ రాత్ కీ కహానీ ‘అంటూ ఒక విభిన్నమయిన కవిత రాసింది నస్రీన్.తమ అలసటను,దుఃఖాన్ని సాంత్వన పరచి, మరో ఉదయానికి శక్తిని,ప్రేరణని ఇచ్చే రాత్ ..అనివార్య నేస్తం రాత్ అంటూ రాసిన ఈ కవిత రాత్రుళ్లు స్త్రీల దుఃఖాలకు ఆలంబనగా నిలుస్తాయని, ప్రపంచం తెలియని తమకు రాత్రి మాత్రం తెలుసని చెబుతుంది.స్త్రీ ఆంతరంగిక , లోలో మసలే విడమరచి చెప్పలేని ఎన్నింటికో రాత్రి ఒక్కటే ఎల్లలు లేని స్వేఛ్చా సామ్రాజ్యం అని కలవరించిన ఈ కవిత శిల్పం పట్ల మరింత శ్రద్ధ పెడితే ఇదొక అత్యుత్తమ కవిత అయి వుండేది.ఇప్పుడు మంచి కవితగా మాత్రమే మిగిలింది..నస్రీన్ ఖాన్ విభిన్నమయిన వస్తువును ఎన్నుకోవడంలో ఆమె ఒక జర్నలిస్టు అవడం కూడా ఒక కారణం కావచ్చు.వృత్తిలో భాగంగా భిన్న వాతావరణాల్లో రకరకాల వ్యక్తులను,

రకరకాల సమస్యలను చూడడం కలవడం ఆమె చూపును విశాలం చేసింది.వస్తువును దర్శించడంలో ఒక సునిశిత, సూక్ష్మ దృష్టి ని కలిగించింది.నోట్ల రద్దు చేసిన సమయంలో ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోటు సగటు మనిషికి ’ఆరోవేలు’ లా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పడం మంచి గమనింపు.సానిటరీ న్యాప్కిన్ పై GST వేసిన ప్రభుత్వంను ’ మన బతుకులు లగ్జరీ కాకున్నా/ రతుస్రావాలకైనా లగ్జరీ బడ్జెట్ లో/ చోటు దక్కిందని గర్వపడు’ అనడం వ్యంగ్యంగా చురకలేయడమే. సిల్ సిలా, మొహబ్బతీ జుబాన్,గో వన్నె పులి,చమ్కీ చీర,కాలే బాల్, యుద్ధనౌకను నేను లాంటి కవితలు చదవతగ్గవి. ’ఖుదా కీ దౌలత్ అమ్మీ ’ కవిత అలా వచన కవిత్వంగా జాలు వారింది.తమకు ఈ గతి పట్టించి దేవుడు వుండివుంటే ఆయన్ను నిలదీసే కవితలు బాగున్నాయి.మొత్తంగా చూస్తే జఖ్మి ఒక ముస్లిం స్త్రీ ఆంతరంగిక వేదనలను, అసమానతలను, సున్నిత భావోద్వేగాలను, అమ్మల నిరంతర కష్టాలను, సగటు ముస్లింల జీవన వేదనలను, ఒక చదువుకున్న ముస్లిం స్త్రీ సామాజిక స్పృహను పట్టించింది.నస్రీన్ వుపయోగించిన ఉర్దూ సమ్మిశ్రిత తెలుగు భాష తెలుగు సాహిత్యానికి , కవిత్వానికి ఒక విభిన్న మేలిమి చేర్పు. పుస్తకానికి ముందుమాటల్లో శిలాలోలిత గారు ‘

ఇటీవల కాలంలో కవయిత్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒంటరి గూళ్ల నుంచి రెక్కలు తొడుక్కొని ఎగురుతున్న పక్షి సమూహాల సంఖ్య పెరిగింది‘ అనడం నిజం.మరో కవయిత్రి షాజహానా రాస్తూ…‘ ఇవి అందరికీ కవితలుగా అనిపిస్తున్నాయేమో గానీ ఇవి ముస్లింల అంటే మీ తోటి మనుషుల ఆత్మఘోష. వాళ్ల కన్నీళ్లకు అనువాదం. వాళ్ల రంగు వెలసిన జీవితాలకు చిత్రిక పట్టిన కథలు‘ అని సరిగ్గా అంచనా వేయడం వెనుక ఆమె కూడా ఒక ముస్లిం కవయిత్రి కారణం.
జఖ్మీ చేస్తున్న అప్పీలు ఒకటే…./ ‘ పిడికిలి బిగుసుకున్నా కొద్దీ/ క్షమనే ఆయుధంగా మార్చిన వారం/ వెక్కిరింతలను ఆశీర్వాదాలుగా మలుచుకున్న వారం/ వేరు చేస్తున్నాకొద్దీ అక్కున చేర్చుకుంటున్నవారం/ శాంతికాముకులుగా రూపాంతరం చెందుతున్నవారం/ మేం ముసల్మానులం‘/ వస్తువుకు తగ్గా శిల్పం వ్యక్తం కాని కవితలున్నాయి. ఇది నస్రీన్ ఖాన్ మొదటి ప్రయత్నం కనుక వీటి విషయం అప్రధానం.వస్తువుకు కొదవ లేని నస్రీన్ కవిత్వం మీద, అభివ్యక్తి మీద , తనకు సొంతమయిన భాష మీద దృష్టి పెడితే త్వరలోనే మంచి ముస్లిం కవిత్వానికి ఆధారం కాగలదు. అందుకు తగ్గ సరంజామా నస్రీన్ దగ్గర పుష్కలంగా వుంది.కావలసిందల్లా అధ్యయనం..అభివ్యక్తి.

పుస్తకం : జఖ్మి
కవయిత్రి : నస్రీన్ ఖాన్
పేజీలు: 138
ప్రచురణ : NK పబ్లికేషన్స్
ప్రతులకు :96524 32981
వెల : 120/.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News