ముంబై : ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహావికాస్ అఘాడి ( ఎంవీఏ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ ) ఏర్పాటు చేసింది. కొందరు ఈడీ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి సిట్‌ను ఉద్ధవ్ సర్కార్ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ వీరేష్ ప్రభు అనే అధికారి నేతృత్వంలో సిట్ పని చేస్తుందని చెప్పారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. గత నెలలో సంజయ్ రౌత్ మీడియా సమావేశంలో కొందరు అధికారులు బిజేపికి ఎటిఎంలుగా పనిచేస్తున్నారని అన్నారు. బలవంతపు వసూళ్ల ఆరోపణపై నలుగురు ఈడీ అధికారులపై ముంబై పోలీసులు దర్యాప్తు జరపనున్నారని, వీరిలో కొందరు జైళ్లకు వెళ్లాల్సి వస్తుందని ఆరోపించారు. అయితే ఆ అధికారుల పేర్లు మాత్రం సంజయ్ రౌత్ వెల్లడించలేదు.