నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కోర్ట్ – – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్రంలో మంగపతి పాత్ర పోషించిన శివాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “కోర్ట్ సినిమాలో చేసిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల. నాని ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. నా కోసం ఇలాంటి క్యారెక్టర్ పుట్టిందని భావిస్తున్నాను. డైరెక్టర్ రియల్ లైఫ్ నుంచి ఈ క్యారెక్టర్ తీసుకున్నాడని భావిస్తున్నాను.
నా పాత్రకి సంబంధించిన ప్రతిది డైరెక్టర్ క్రెడిట్. నా క్యారెక్టర్‌ని డైరెక్టర్ నెక్స్ లెవెల్ లో రాసుకున్నాడు. ఇందులో ప్రతి పాత్రని శిల్పం చెక్కినట్లుగా చెక్కాడు. ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రాజనాల మరపురాని పాత్రలు చేశారు. అలాంటి పాత్రలు చేయాలని నాకు వుండేది. -మంగపతి పాత్రలో సహజమైన ఎమోషన్ వుంది. ప్రతి కుటుంబంలో అలాంటి వ్యక్తి ఉంటారు. -మంగపతి క్యారెక్టర్‌కి వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. -నాని నటుడిగా నిరూపించుకున్నారు. నిర్మాతగా ఆయనపై చాలా గౌరవం వుంది. కొత్త వారిని ప్రోత్సాహించడంలో గొప్ప చొరవ చూపిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ లాంటి బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా అవుతుంది. ప్రస్తుతం లయ, నేను కలసి ఓ సినిమా చేస్తున్నాం. అలాగే దండోరా అనే సినిమా చేస్తున్నాను”అని అన్నారు.