Monday, November 25, 2024

రేపు నా అరెస్టు ఖాయం: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లిక్కిర్ కుంభకోణంలో నిందితులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) బెదిరిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ కుంభకోణమంటూ ఏదీ లేదని, కావాలనే దర్యాప్తు సంస్థలు ఆప్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ఆయన ఆరోపించారు. లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆదివారం ఉదయం తమ ఎదుట హాజరుకావాలని సిబిఐ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో శనివారం కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాస్తవానికి తాము రూపొందించిన ఎక్సయిజ్ పాలసీ అద్భుతమైనదని, పంజాబ్‌లో దీన్ని అమలు చేస్తుండగా 50 శాతం ఆదాయం పెరిగిందని ఆయన చెప్పారు. గత 75 ఏళ్లలో ఆప్‌ను వేధించినట్లు మరే పార్టీని వేధించలేదని ఆయన అన్నారు. తాను సిబిఐ ఎదుట హాజరవుతానని, తనను అరెస్టు చేయాలని ఇప్పటికే సిబిఐని బిజెపి ఆదేశించిందని ఆయన చెప్పారు. రేపు తనను అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.

పేదరికాన్ని నిర్మూలించి, పేదలను విద్యాధికులను చేసేందుకు ఆప్ కృషి చేస్తోందని, ఈ కారణంగానే తమపై కేంద్రం కక్షగట్టిందని ఆయన ఆరోపించారు. సిబిఐ, ఇడి తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆప్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు సంస్థలు తప్పుడు అఫిడవిట్లు వేశాయని, అయితే వాస్తవం వేరేనని ఆయన తెలిపారు. సిసోడియాకు చెందిన నాలుగు ఫోన్లు ఇడి వద్ద, ఒక ఫోన్ సిబిఐ వద్ద ఉందని, మిగిలిన ఫోన్లు ఆప్ కార్యకర్తల వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ విషయం సిబిఐ, ఇడికి తెలుసునని, అయినప్పటికీ కోర్టులో తప్పుడు అఫిడవిట్లు వేశాయని ఆయన ఆరోపించారు.

తాము రూ. 100 కోట్ల ముడుపులు పుచ్చుకున్నామని ఆరోపించారని, అయితే ఆ డబ్బు ఎక్కడుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 400కు పైగా దాడులు జరిగాయని, అయినా ఆ డబ్బు ఎక్కడుందో చెప్పాలని ఆయన కోరారు. గోవా ఎన్నికల కోసం ఆ డబ్బు వాడినట్లు ఆరోపిస్తున్నారని, తాము నియమించిన గోవాలోని ప్రతి వెండర్ వద్ద తనిఖీలు చేసినా ఏమీ దొరకలేదని ఆయన చెప్పారు. దర్యాప్తు సంస్థల అసలు టార్గెట్‌ఎక్సయిజ్ పాలసీలో అవినీతి గురించి కాదని ఆయన చెప్పారు. గత నెల ఢిల్లీ అసెంబ్లీలో అవినీతి గురించి తాను మాట్లాడిన తర్వాత తర్వాత నంబర్ నీదే అని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీపై జమ్మూ కశ్మీరు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వూలో చేసిన ఆరోపణలు చాలా గంభీరమైనవని, ప్రధాని అవినీతిపరుడని దీన్నిబట్టి అర్థమవుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీ గురించి ఇవే విషయాలను తాను ఏడాది క్రితం చెప్పినపుడు ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. కాని..ఇప్పుడు మోడీకి అత్యంత సన్నిహితుడైన సత్యపాల్ మాలిక్ అవే విషయాలు చెబుతున్నారని, తాను చెప్పిందే కరెక్టని ఇప్పుడు తేలిపోయిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News