న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపర్చడం కోసమేనని పేర్కొన్నారు. ఈ పదవీ కాలాన్ని తొమ్మిదేళ్ల సేవగా అభివర్ణించారు.‘ దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో నేనెంతో కృతజ్ఞతా భావం, వినమ్రతతో ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి చర్య. దేశప్రజల జీవితాలను మెరుగుపరడానికి ఉద్దేశించినవే.
అట్టడుగు పేదప్రజల జీవితాలను గౌరవాన్ని పెంచడానికి గత తొమ్మిదేళ్ల కాలంలో మేము శ్రమించాం. లెక్కలేనన్ని పథకాల ద్వారా లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకు వచ్చాం. అభివృద్ధి చెందిన భారతావనని నిర్మించేందుకు ఇంతకన్నా ఎక్కువ శ్రమిస్తాం’ అని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ బుధవారం అనేక ప్రచార కార్యక్రమాలకు తెరదీసింది.‘ స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్’ పేరిట నెల రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
‘ నేషన్ ఫస్ట్’ అనే సందేశంతో ఈ సమయంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని బిజెపి ఒక ప్రకటనలో పేర్కొంది.ప్రధాని మోడీ బుధవారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఓ ర్యాలీలో ప్రసంగించనున్నారు. 2014 మే 26నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 మే 30న ఆయన రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.