ప్రధాని నరేంద్ర మోడీ అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం పనిచేస్తారని, కాని తన కుటుంబం రాయబరేలి ప్రజల కోసం ఎల్లప్పుడూ పనిచేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. రాయబరేలి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తొలి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగిస్తూ ఇక్కడి ప్రజలతో తన కుటుంబానికి బలమైన సంబంధాలు ఉన్న కారణంగానే తాను రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. దేశంలోని 22 నుంచి 25 మంది పారిశ్రామిక వేత్తల కోసం రూ. 16 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందని, ఇది 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకం కోసం కేటాయించిన నిధులతో సమానమని ఆయన చెప్పారు. రాయబరేలి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ పాటుపడ్డారని రాహుల్ తెలిపారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణించే రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఈ నియోజకవర్గానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించారు.
దేశంలో రైతులు, నిరుద్యోగ యువజనులు ఎదుర్కొంపటన్న సమస్యలను మీడియా చూపించడం లేదని రాహుల్ తన ప్రసంగంలో ఆరోపించారు. వీటికి బదులుగా బడా పారిశ్రామికవెత్తల కుటుంబాలలో జరిగే వివాహ మమోత్సవాలకు మీడియా ప్రాధాన్యం ఇస్తోందని ఆయన విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేద కుటుంబాల లెక్కలు తీసి ఒక్కో కుటుంబానికి ఏడాది రూ. 1 లక్ష చొప్పున లేదా నెలకు రూ. 8,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలు వేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. చిన్న రైతుల రుణాలను కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తుందని, రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరను చట్టబద్ధంగా అందచేస్తుందని ఆయన వాగ్దానం చేశారు. రక్షణ దళాలలో అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి పెన్షన్ సౌకర్యంతో సాయుధ దళాలలో యువతకు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలలో యువతకు ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్ లభిస్తుందని, అనంతరం వారి ప్రతిభ ప్రాతిపదికన శాశ్వాత ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. మే 20న ఐదవ దశలో రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్నది.