Wednesday, September 18, 2024

1984 హైజాక్ విమానంలో మా తండ్రి ఉన్నారు

- Advertisement -
- Advertisement -

1984లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్నారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం వెల్లడించారు. అటువంటి పరిస్థితుల్లో ‘రెండు వైపుల’ నుంచి ఒక విశిష్ట గవాక్షం తనకు ఉందని, కుటుంబ సభ్యుల పరంగా ఒక పరిస్థితి, ప్రభుత్వంలో ఉన్నవారి పరంగా మరొక స్థితి అని ఆయన పేర్కొన్నారు. 1999లో ఐసి814 విమానం హైజాకింగ్‌పై ఇటీవల విడుదలైన ఒక టివి సీరీస్ గురించి జెనీవాలో ఒక భారతీయ సమాజ కార్యక్రమంలో ఒక ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇచ్చారు. అప్పట్లో ఒక యువ అధికారిగా తాను ఒక వైపు హైజాక్ పరిస్థితిపై చర్యలు తీసుకుంటున్న బృందంలో ఉన్నానని, మరొక వైపు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్న కుటుంబాల బృందంలో సభ్యుడినని ఆయన తెలియజేశారు. భారతీయ సమాజాన్ని ఉద్దేశించి జైశంకర్ ప్రసంగించిన అనంతరం ప్రశ్నోత్తరాల సెషన్‌లో సభికుల్లో ఒకరు ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సీరీస్ ‘ఐసి814: ది కాందహార్ హైజాక్’పై వ్యాఖ్యానించవలసిందని మంత్రిని అడిగారు.

‘హైజాకింగ్ విషయంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం వ్యవహరణ తీరును సరైన రీతిలో చూపలేదు’ అని ఆ సభికుడు అన్నారు. ఆ సీరీస్‌ను తాను చూడలేదని జైశంకర్ చెబుతూ హైజాకింగ్ సంఘటనతో తన వ్యక్తిగత సంబంధాన్ని వెల్లడించారు. ‘1984లో ఒక విమానం హైజాక్ జరిగింది. నేను అత్యంత యువ అధికారిని. దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్న బృందంలో సభ్యుడిని. నేను మా తల్లికి ఫోన్ చేసి ‘నేను రాలేను. హైజాకింగ్ జరిగింది’ అని చెప్పాను’ అని ఆయన తెలిపి, తాను ఎలా ఇంటికి వెళ్లవలసి వచ్చిందీ, తన భార్య కూడా ఉద్యోగిని కనుక తన చిన్న కుమారునికి అన్నం తినిపించవలసి వచ్చిందీ వివరించారు. ‘ఆ తరువాత మా తండ్రి ఆ విమానంలో ఉన్నట్లు నాకు తెలిసింది. విమానం దుబాయిలో దిగింది. అది ఒక పెద్ద కథ. కానీ అదృష్టవశాత్తు, ఎవరూ హతం కాలేదు. అది సమస్యాత్మకంగా పరిణమించి ఉండేదే’ అని జైశంకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News