Friday, December 20, 2024

మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
అనుమతులు లేకుండా 4వ ప్లాంట్ నిర్మాణం
500 మీటర్ల ఎత్తులో పనులు చేస్తున్న కార్మికులు
మీడియాను లోపలికి రానివ్వని యాజమాన్యం

మన తెలంగాణ/హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్ళచెర్వు మండల కేంద్రంలో ఉన్న మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో మంగళవారం లిఫ్ట్ వైర్ తెగి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్ధానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎటువంటి అనుమతులు లేకుండా 4వ సిమెంట్ యూనిట్‌ను నిర్మిస్తున్నారు. 4వ యూనిట్ నిర్మాణ ప్రదేశంలో పలువురు కార్మికులు పనులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన 8మంది కాంట్రాక్ట్ కార్మికులలో నలుగురు కార్మికులు ఒకచోట, మరో చోట మిగతా నలుగురు కార్మికులు పనులు చేస్తున్నారు.

నలుగురిలో ఒకరు పరికరాల కోసం వెళ్ళగా, ముగ్గురు కార్మికులు ఒకేచోట సుమారు 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పనులు చేస్తున్న సమయంలో లిఫ్ట్‌వైర్ తెగి లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అరవింద్ సింగ్ (28) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తికి స్వల్పగాయాలు కావడంతో కోదాడలోనే చికిత్సను అందించి, తీవ్రగాయాలైన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కార్మికుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఇది ఇలా ఉండగా ప్రమాదం జరిగిన తర్వాత చాలా సేపటి వరకు మీడియాను లోపలికి వెళ్ళనివ్వకుండా మహా సిమెంట్ యాజమాన్యం గేట్లు వేశారు. కార్మికుల వద్దనున్న సెల్‌ఫోన్స్ తీసుకుని సిగ్నల్ జామర్లను కూడా ఏర్పాటు చేసి, పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులనందరినీ బయటకు పంపించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులను మాత్రమే లోపలికి పంపించారు. లిఫ్ట్ వైరు తెగిపోవడానికి గల కారణాలు తెలియాల్సివుంది.

ఫ్యాక్టరీ ఘటన బాధాకరం : మై హోం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని మేళ్లచెరువులోని సిమెంట్ యూనిట్ వద్ద ఈరోజు జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు ఒకరు మృతి చెందడం పట్ల మై హోం యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మూసుకుపోయిన కాంక్రీట్ ఫిల్లింగ్ పైప్‌లైన్‌ను సరిచేస్తున్న క్రమం లో ఈ ప్రమాదం జరిగినట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కాంక్రీట్ పైప్‌లైన్‌లో అడ్డు తొలగించేందుకు ముగ్గురు కార్మికులు ప్రయత్నిస్తున్న క్రమంలో స్కాఫోల్డింగ్ కూలడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు పేర్కొంది. మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయట పడగా, వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరమని మై హోం యాజమాన్యం ఆవేదన వ్యక్తంచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News