కోల్‌కత: కూచ్ బిహార్ కాల్పుల ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసినట్లు చెబుతున్న ఆడియో టేపు వైరల్ కావడంతో తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసిన వారినందరినీ కనుగొంటానని, ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తానని టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ శనివారం హెచ్చరించారు. కూచ్ బిహార్‌లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పులలో మరణించిన నలుగురు వ్యక్తుల మృతదేహాలతో ర్యాలీ నిర్వహిద్దామని మమత సీతల్‌కుచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఎంసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్థా ప్రతిమ్ రేకి సూచించినట్లు చెబుతున్న ఆడియో క్లిప్‌ను బిజెపి శుక్రవారం విడుదల చేసింది. ఏప్రిల్ 10వ తేదీన నాలుగవ విడత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీతల్‌కుచిలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పులలో నలుగురు వ్యక్తులు మరణించారు. తమ తుపాకులను స్థానికులు లాక్కోవడానికి ప్రయత్నించడంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని కేంద్ర బలగాలు తమ చర్యను సమర్థించుకున్నాయి.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్టా మమతా బెనర్జీ ప్రతిపాదిస్తున్నట్లు బయటకొచ్చిన ఆడియో టేపు మరిన్ని ఉద్రిక్తతలను సృష్టించగలదని ఆరోపిస్తూ బెంగాల్ బిజెపి ప్రతినిధివర్గం రాష్ట్ర ఎన్నికల అధికారి అరీజ్ అఫ్తాబ్‌కు విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ ఆడియో క్లిప్‌ను నకిలీగా అధికార టిఎంసి అభివర్ణించింది. అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని స్పష్టం చేసింది.
My phone is tapped says Mamata Banerjee