తిరువనంతపురం: కేరళ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు, బిజెపి అభ్యర్థి అనిల్ ఆంటోని ఓడిపోవాలని కోరుకుటున్నట్ల్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన కుమారుడి పార్టీ(బిజెపి) ఓటమి చెందాలని, తన కుమారుడికి ప్రత్యర్థిగా పథనంతిట్ట స్థానంలో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోని గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు.
కాంగ్రెస్ నాయకుల పిల్లలు బిజెపిలో చేరడాన్ని ఆయన తప్పుపట్టారు. తన కుమారుడి రాజకీయాల గురించి విలేకరులు పదే పదే ప్రశ్నించగా తనది కాంగ్రెస్ మతమని ఆంటోని స్పష్టం చేశారు. తన పార్టీ ప్రధాని నరేంద్ర మోడీపైన, బిజెపిపైన, ఆర్‌ఎస్‌ఎస్‌పైన నిరంతరం పోరాడుతోందని కేరళ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన ఆంటోని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బిజెపిపైన, ప్రధాని మోడీపైన, ఆర్‌ఎస్‌ఎస్‌పైన అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని ఆయన చెప్పారు. జాతీయ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని తీసుకోవడం లేదంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా ఆయన ఆరోపణలను కేరళ ప్రజలు పట్టించుకోరని ఆంటోని చెప్పారు. ఇండియా కూటమి ప్రతిరోజు ముందుకు దూసుకు వెళుతుండగా బిజెపి దిగజారిపోతోందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు తమకు మంచి అవకాశం వచ్చిందని ఆయన అన్నారు.