ఈరోజు పోలీసుల ముందుకు వస్తారు: కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా
నేడు 11 గంటలకు హాజరు కావాలని యుపి పోలీసుల తాఖీదు
లఖీంపూర్/లక్నో: 8మంది చావుకు కారణమైన లఖీంపూర్ ఘటనకు సంబంధించిన కేసులో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌మిశ్రాకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు శుక్రవారం మరోసారి నోటీస్ జారీ చేశారు. శనివారం ఉదయం 11గంటల వరకల్లా తమ ముందు హాజరు కావాలని ఈ నోటీస్‌లో ఆదేశించారు. గురువారం ఇచ్చిన నోటీస్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఇచ్చిన ఆదేశాలకు స్పందన లేకపోవడంతో తాజా నోటీస్ జారీ అయింది. అజయ్‌మిశ్రా ఇంటికి ఈ నోటీస్‌ను అంటించారు.
శుక్రవారం గడువు సమయం వరకు ఆశిష్‌మిశ్రా కోసం డిజిపి ఉపేంద్ర అగర్వాల్ వేచి చూశారు. ఆశిష్ రాకపోవడంతో నోటీస్ అంటించారు. ఈ కేసు దర్యాప్తు బృందానికి ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆశిష్‌మిశ్రా నేపాల్‌కు పారిపోయినట్టు వార్తా కథనాలు వెల్లడయ్యాయి. దాంతో, యుపిలోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ కేంద్రం జోక్యానికి డిమాండ్ చేశారు. నిందితుడిని నేపాల్‌లో అరెస్ట్ చేసి తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ బృందాలు ఆశిష్‌ను పట్టుకునేందుకు గాలింపు జరుపుతున్నామని చెబుతుండగా, ఆయన ఎలా తప్పించుకున్నారని సంయుక్త్ కిసాన్‌మోర్చా ప్రశ్నించింది. ఇప్పటివరకు ఆశిష్‌ను అరెస్ట్ చేయకపోవడం పట్ల మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది.
నా కొడుకు అమాయకుడు.. ఈరోజు పోలీసుల ముందుకు వస్తారు: కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా
తన కుమారుడు అమాయకుడని, అనారోగ్యంతో బాధ పడటం వల్ల పోలీసుల ముందు శుక్రవారం హాజరు కాలేకపోయారని, శనివారం హాజరవుతారని కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తెలిపారు. తమకు చట్టంపై పూర్తి విశ్వాసం ఉన్నదని ఆయన అన్నారు. గురువారం తన కుమారుడు నోటీస్ అందుకున్నారని..అయితే,తను ఆరోగ్యంగా లేనందున హాజరు కాలేకపోయారని అజయ్‌మిశ్రా అన్నారు. శనివారం పోలీసుల ముందు హాజరై తాను అమాయకుడన్న విషయాన్ని సాక్షాధారంతో ప్రకటిస్తారని అజయ్‌మిశ్రా తెలిపారు. లక్నో విమానాశ్రయంలో అజయ్‌మిశ్రా మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వారు ఏదైనా డిమాండ్ చేయగలరని మిశ్రా అన్నారు. బిజెపి ప్రభుత్వం నిష్పాక్షికంగా పని చేస్తుందని, దోషులుగా ఎవరు తేలినా వారిపై చర్యలుంటాయని మిశ్రా అన్నారు. అక్టోబర్ 3న లఖీంపూర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనలో ఆశిష్‌మిశ్రాపై హత్య కేసు నమోదైన విషయం తెలిసిందే.