Saturday, December 21, 2024

నా ఇంటి పేరు మోడీ కాదు..దేశం విడిచి పారిపోను: అభిషేక్ బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: తన ఇంటి పేరు మోడీ లేదా మాల్యా కాదని, ఎటువంటి ఒత్తిఢి ఎదురైనా పారిపోయే వ్యక్తిని తాను కాదని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. తాను దేశం విడిచి పారిపోయినట్లు కొందరు పనిగట్టుకుని చేస్తున్న వదంతులను ఆయన ఖండించారు.

కంటి చికిత్స కోసం విదేశాలకు వెళితే తాను దేశం విడిచి పారిపోయినట్లు వదంతులు సృష్టించారని ఆయన చెప్పారు. ఒక్క విషయం తాను స్పష్టం చేయదలిచానని, తన ఇంటి పేరు మోడీ లేదా మాల్యా లేదా చోక్సీ కాదని టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ఇంటి పేరు బెనర్జీ అని, తన పేరు అభిషేక్ బెనర్జీ అంటూ ఆయన చెప్పారు.

ఆత్మగౌరవంతో ఎలా పోరాడాలో తనకు తెలుసునని, తలవంచడం తన నైజం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిడికి తలొగ్గి ఢిల్లీకి లొంగిపోయే వ్యక్తిని కానని, ఎటువంటి ఒత్తిడి ఎదురైనా తాను పారిపోయే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం తృణమూల్ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే దర్యాప్తు కూడా అవసరం లేదని, తాను బహిరంగంగా ఉరేసుకుని చనిపోతానని ఆయన సవాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News