Wednesday, January 22, 2025

మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పం

- Advertisement -
- Advertisement -
  • సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మహిళలకు మహర్దశ
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి: మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పం, మహిళలు వారి కుటుంబాలను వారే సాదుకునే స్థాయికి రావాలి. మహిళలు బాగుపడితే ఆ కుటుంబం, గ్రామం, దేశం బాగుపడుతుంని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించి, పరిశీలించి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందచేశారు.

రాయపర్తి మండల కేంద్రంలో గల కోఆపరేటివ్ భవనంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని రాయపర్తి మండలం మండలం కాట్రపల్లి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ ఆయా కేంద్రాల వద్ద కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హయాంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయా మహిళా సంఘాలు బలోపేతమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళలకు మహర్దశ ఏర్పడింది.

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పర్చడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలను మంత్రి వివరించారు. మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి పర్చే విధంగా చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి మహిళలకు వివరించారు. ప్రభుత్వం అమలుచేసే అనేక పథకాలకు మహిళలను లబ్ధిదారులుగా నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. మీ లాగే మీ పిల్లలు కష్టాలు పడొద్దు. వారు బాగా చదువుకోవాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకు ముందుగా మీరు బాగుపడాలి అన్నదే తన సంకల్పమని మంత్రి చెప్పారు.

ఇందులో భాగంగా తాను మహిళల కోసం కుట్టు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకొని సీఎం కేసీఆర్‌ను అడిగిన వెంటనే అంగీకరించడమే కాక ప్రోత్సహించారన్నారు. మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలోని ఉచిత కుట్టు శిక్షణను డ్వాక్రా మహిళలను ఇప్పించామని ఆ కార్యక్రమం సఫలం కావడంతో ఇప్పుడు తమ ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు తలెఇపారు.

శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆ సదుపాయాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొడకండ్లలోను మినీ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటుచేస్తున్నామని దీంతో స్థానికులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడమే కాకుండా బొంబాయి, భీమండి, సూరత్ వంటి నగరాలకు వలస పోయిన వారికి ఇక్కడ పునరావాసం లభిస్తుందన్నారు. రానున్న కాలంలో మహిళలు సీఎం కేసీఆర్ కోసం.. తన కోసం సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లితో మహిళలు ఫొటోలు దిగారు. కాగా మహిళలు మంత్రిని స్వాగతించి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపిటిసి, పాక్స్ ఛైర్మన్ రాంచంద్రారెడ్డి, ఐత రాంచందర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, అష్రఫ్ పాషా, ఎల్లాస్వామి, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఆయా మండల పార్టీ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News