Saturday, November 23, 2024

మయన్మార్ ప్రజాపోరాటం

- Advertisement -
- Advertisement -

Myanmar public struggle on military coup

 

మన ఇరుగు పొరుగునున్న మయన్మార్, బంగ్లాదేశ్‌లో ఆదివారం నాడు సంభవించిన రెండు ఘటనలు ప్రజాస్వామిక స్వేచ్ఛల కోసం ప్రజల్లో రగులుతున్న ఆకాంక్షను రుజువు చేశాయి. మయన్మార్ ఎన్నికలో విజయం సాధించిన అంగ్ సాన్ సూకీ బృందం తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టబోతుండగా సైనిక నియంతలు తిరిగి ఉక్కు పాదం మోపడం ఆమెను, ఆమె అనుచరులను గృహ నిర్బంధంలో పెట్టి మిలిటరీ పాలనను విధించడం అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళనకు అంకురార్పణ చేసింది. వారు అప్పటి నుంచి పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ నియంతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ధిక్కారాన్ని సహించని సైనిక పాలకులు శాంతియుత ప్రదర్శకులపై ఆదివారం నాడు జరిపించిన కాల్పుల్లో కనీసం 18 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. బంగ్లాదేశ్‌లో కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించినందుకు జైలు పాలైన ఒక రచయిత అక్కడే మరణించిన ఘటనకు నిరసనగా గత నాలుగు రోజులుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పోలీసు బలగాలతో హోరాహోరీ పోరాటం చేస్తున్న తీరు గమనించదగినది.

నిరసన కంఠాన్ని ఎలాగైనా అణచివేయవచ్చుననే ధీమాతో ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని మయన్మార్, బంగ్లాదేశ్ ఉదంతాలు చాటుతున్నాయి. మయన్మార్‌లో ప్రధాన నగరం యాంగూన్‌తో పాటు దావీ, మాండలే వంటి ఇతర చోట్ల కూడా నిరసన ప్రదర్శకులు సైనిక ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్నారు. శాంతియుత ప్రదర్శకులపై పోలీసులు నేరుగా జరిపిన కాల్పులు అక్కడ ఒకే రోజున 18 మంది మరణించిన అపూర్వ పరిణామానికి దారి తీశాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజలు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆదివారం నాటి ఘటనలు చాటుతున్నాయి. గతంలో ఐదు దశాబ్దాల పాటు సైనిక నియంతృత్వంలో అనుభవించిన కష్టాలు మయన్మార్ ప్రజలను మరింత పదును దేర్చాయి. ఈసారి వీలైనంత తొందరగా అంగ్ సాన్ సూకీ విడుదలను ఆమె నాయకత్వంలో ప్రజాస్వామిక ప్రభుత్వ పునరుద్ధరణను సాధించాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు.

పోలీసులు తమ ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడం లేదనే దారుణ వాస్తవం ఆదివారం నాటి మారణకాండ రుజువైన తర్వాత కూడా మయన్మార్ ప్రజలు వణికిపోలేదని ఆ పరిణామాలు వారిలోని చైతన్యాన్ని మరింత పెంచాయని సోమవారం నాడు అక్కడ జరిగిన సన్నివేశాలు రుజువు చేస్తున్నాయి. యాంగూన్‌లో గుమిగూడుతున్న నిరసన ప్రదర్శకులను పోలీసులు బాష్పవాయువు గోళాలను, ఇతర అణచివేత సాధనాలను ప్రయోగించి చెదరగొట్టిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. గతంలో అంగ్‌సాన్ సూకీని గృహ నిర్బంధంలో ఉంచి సైనిక పాలకులు సుదీర్ఘ కాలం నిరంకుశ రాజ్యం చేశారు. స్వతంత్ర మీడియాకు చోటు లేకుండా ప్రజాభిప్రాయం ఎక్కడా ప్రతిబింబించకుండా ఇనుప తెరలు బిగించారు. అప్పుడు అంతర్జాతీయ శక్తుల ఒత్తిడి మేరకు అతి కష్టంగా ప్రజాస్వామ్య పాక్షిక పునరుద్ధరణకు అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా సైనిక పాలకులపై అంతర్జాతీయ ఒత్తిడి మొదలైంది. జో బైడెన్ అధ్యక్షతన అమెరికాలో కొత్తగా ఏర్పడిన డెమొక్రాట్ల ప్రభుత్వం మయన్మార్ పరిణామాల పట్ల తీవ్రంగా స్పందించింది.

సైనిక పాలన ఏర్పడిన పక్షం రోజుల్లోనే బైడెన్ ప్రభుత్వం మయనార్‌పై ఆర్థిక ఆంక్షలను ప్రకటించి అమల్లోకి తెచ్చింది. అమెరికాలో గల వంద కోట్ల డాలర్ల విలువైన మయన్మార్ ఆస్తులను స్తంభింప చేసింది. మయన్మార్ ప్రజల నిరసనను ప్రపంచం గమనిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అదనపు ఆంక్షలు కూడా విధిస్తామని ప్రకటించారు. ఇంతకు ముందు రోహింగ్యాలపై హింసాయుత దాడులను ప్రోత్సహించి అధిక సంఖ్యలో వారు బంగ్లాదేశ్‌కు కట్టుబట్టలతో పారిపోయేలా చేసినందుకు మయన్మార్ సైనిక పాలకులపై అమెరికా ఆంక్షలు విధించి ఉంది. తాజా ఆంక్షలు నియంతలపై ఏ మేరకు పని చేస్తాయో చూడాలి. బలమైన చైనా అండదండలతో సైనిక పాలకులు మరొక సారి ప్రజాస్వామ్యాన్ని కబళించడానికి సాహసించారనే విషయం తెలిసిందే. నెల రోజులుగా నిర్విరామంగా సాగుతున్న నిరసన ఉద్యమం ఒక్కటే అంతిమంగా మయన్మార్ నియంతల మెడలు వంచగలదని ఆశించవచ్చు.

దాదాపు ప్రపంచమంతటా నియంతల శకం ముగిసిపోయి చాలా రోజులైన తర్వాత కూడా మయన్మార్‌లో అది తిరిగి పడగ విప్పి కాటేయడం ఆందోళనకరం. అలాగే ప్రజాస్వామ్య పాలకులు కూడా ప్రజల అభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా వారి కంఠాన్ని తొక్కిపెట్టే ధోరణులు ప్రదర్శించడం కొత్త రకం అణచివేతకు నిదర్శనం. అయితే ప్రజలకు బలమైన ఓటు హక్కు ఉన్నంత కాలం అటువంటి పాలకుల ఆటలు నిరంతరంగా సాగబోవు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News