మనతెలంగాణ/హైదరాబాద్: మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరడంతో మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. మైనంపల్లి రాకను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న మల్కాజిగిరి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్‌కు పలువురు కాంగ్రెస్ నేతలు జతయ్యారు. ఈ మూడు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులంతా ఆయన చేరికపై అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలిసింది. గురువారం ఖర్గే సమక్షంలో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో పాటు ఆయన కుమారుడు రోహిత్ కూడా పార్టీలో జాయి న్ చేశారు. ఈ నేపథ్యంలోనే మూడు జిల్లాలకు కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి రానున్న రోజుల్లో ఎలా వ్యవహారిస్తారోనన్న ఆందోళనను అధిష్ఠానం ఎదుట వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. వారం రోజులుగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ఈ మూడు జిల్లాలకు చెందిన నాయకులు అధిష్ఠానం ఎదుట అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో వారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే మైనంపల్లి మాత్రం ఈ మూడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని హామీనిచ్చి తాను అనుకున్న రెండు టికెట్‌లు ఇచ్చేలా అధిష్ఠానాన్ని ఒప్పించినట్టుగా తెలిసింది. దీంతో అధిష్ఠానం సైతం మైనంపల్లి మాటలకు కట్టుబడి ఆయన అడిగిన రెండు సీట్లు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
ఇప్పటికే ఇదే అంశంపై మల్కాజిగిరి కాంగ్రెస్ నేత నం దికంటి శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లిని పార్టీలో చే ర్చుకోవడం అధిష్ఠానం ఇష్టమన్నారు. మల్కాజిగిరి, మెదక్‌లో కాకుం డా మైనంపల్లికి వేరేచోట రెండు సీట్లు ఇవ్వాలన్నారు. మల్కాజిగిరి సీటు మాత్రం తనకే ఇవ్వాలని ఆయన మరోసారి అధిష్ఠానానికి విజ్ఞ ప్తి చేశారు. తనకు ఇచ్చే టికెట్ పై క్లారిటీ ఇవ్వాలని హైకమాండ్ ను కోరినట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే క్యాడర్ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తానని ఆయన కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ కూడా నందికం టి శ్రీధర్‌ను బుజ్జగించినా ఆయన మాత్రం మల్కాజిగిరి సీటుపై పట్టువీడకపోవడంపై ఆ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. దీనికితో డు మైనంపల్లి హన్మంతరావుకు రెండు టికెట్‌లు ఇస్తామని అధిష్ఠానం ఇచ్చిన హామీ పార్టీలో మరో కొత్త లొల్లిని సృష్టించింది. పార్టీలో చేరకముందే మూడు టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి ప్రపోజల్ పెట్టగా మైనంపల్లితోపాటు ఆయన కొడుకుకు మాత్రమే టికెట్లు ఇచ్చేందుకు హై కమాండ్ ఆమోదం తెలిపింది.
దీంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడినోళ్లను కాదనీ, ప్యారాచూట్ నేతలకు అడిగిన వెంటనే సీట్లు ఇవ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పాటు మైనంపల్లి చేరికపై ఠాక్రేతో మాట్లాడటం, ఆ వెంటనే రాహుల్ గాంధీకి వివరించడం, మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరడం, ఇదంతా రెండు మూడు రోజుల్లోనే పూర్తి కావడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. ఒకవైపు బిసిలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, ఎస్టీ నేతలు టికెట్ల కోసం ప్రాధేయపడుతుంటే ఆశించిన స్థాయిలో స్పందించని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం మైనంపల్లి అంశాన్ని కేవలం మూడు రోజుల్లో క్లియర్ చేయడం వెనుక ఆంతర్యమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వకూడదని ఉదయ పూర్ డిక్లరేషన్ స్పష్టం చేస్తుంది. అయితే ఐదేళ్లు పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తే దానికి ఒప్పుకోవచ్చని కూడా ఈ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపి, చట్ట సభల్లో ఇతర పోస్టుల్లో పనిచేసి ఉంటే ఈ నియమం వర్తించదని సైతం ఈ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ నిబంధన విధించిది. కానీ కొత్తగా పార్టీలోకి వచ్చేవాళ్లకు రెండు టికెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదన్న రూల్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఈ డిక్లరేషన్‌లో నిబంధనను పొందుపరిచింది. ఈ నిబంధన ప్రకారం మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు వర్తించవు. కానీ, రేవంత్ జోక్యంతోనే స్పెషల్ కేసుగా రెండు టికెట్లు ఇచ్చారన్నది సీనియర్ల వాదన. మైనంపల్లి చేరికతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఉదయ్‌పూర్ డిక్లరేషన్ కు కూడా బ్రేకులు పడ్డాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు టికెట్లపై నిర్ణయం తీసుకోని కమిటీ
అయితే ఇప్పటికే తమకు కూడా రెండు టికెట్‌లు కావాలని కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు టికెట్‌లు కావాలని దరఖాస్తు చేసుకున్న కీలక నేతల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితర ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ల కుటుంబాల నుంచి రెండు టికెట్లు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు. దీనిపై స్క్రీనింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.