Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియా బీచ్‌లో భారీ లోహ సిలిండర్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ : ఆస్ట్రేలియాలో పశ్చిమ తీరం వెంబడి ఓ బీచ్‌లో ఓ భారీ స్థాయి లోహ సిలిండర్ పడి ఉండటం సంచలనానికి దారితీసింది. ఇది చాలా ప్రమాదకరమైన వస్తువు అని, దీని దరిదాపుల్లోకి వెళ్లరాదని బీచ్‌కు చేరే వారిని అధికారులు హెచ్చరించారు. హిందూమహాసముద్రం వెంబడి ఉండే మిడ్‌వెస్ట్ కోస్టులో గ్రీన్ హెడ్ టౌన్ వద్ద పడిన ఈ భారీ లోహశకలంపై పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇది విమానంలో నుంచి జారిపడ్డ వస్తువు కాదని, యుఎఫ్‌ఒది అయినా లేదా గల్లంతయిన మలేసియా విమానం శకలం అయినా అయి ఉంటుందని తొలుత వార్తలు వెలువడ్డాయి. రాగి రంగులో ఉన్న ఈ వస్తువు పూర్తిగా దెబ్బతిని ఉంది. ఈ లోహశకలం ఏమిటనే అంశంపై ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ప్రతినిధి ఒక్కరు స్పందించారు.

ఇటీవల భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ 3 శకలం అయి ఉంటుందని పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒక విదేశీ అంతరిక్ష వ్యోమనౌక నుంచి ఇది జారి పడి ఉంటుందని, సముద్రంలో పడి తీరానికి చేరి ఉంటుందని ఈ ప్రతినిధి తెలిపారు. సంబంధిత వస్తువు గురించి తాము ఇప్పుడు వివిధ దేశాల స్పేస్ అధికారిక సంస్థలతో మాట్లాడుతున్నామని వివరించారు. ఇటీవల ఏదైనా విదేశీ సంస్థ అంతరిక్ష ప్రయోగం చేసి ఉంటే, ఈ వస్తువు వారికి సంబంధించినదా? అనేది నిర్థారించుకుని తెలియచేయాలని సూచించారు. కాగా స్పేస్ ఆర్కియాలిజిస్టు డాక్టర్ అలైస్ గోర్మెన్ గార్డియన్ పత్రికతో మాట్లాడారు. ఇది ఇంధన సిలిండర్ అని, భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ 3 నుంచి విడిపోయిన శకలం అని ఖచ్చితంగా తెలిపారు. ఏది ఏమైనా ఇది సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చిన చెత్త కాదని, స్పేస్ నుంచి వచ్చిపడిందే అన్నారు.

భారతీయులు ఈ విధంగా శకలాలను హిందూ మహాసముద్రంలో పడేస్తున్నారని, దీనిని ఓ గొప్పపనిగా భావించుకుంటూ విజయంగా మలుచుకుంటున్నారని , ఈ షోకు మనం సంతోషించాలా? అని ఓ ఇంటర్నెట్ వాడకందారుడు వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పై నుంచే చంద్రయాన్ సాగిందని ఇప్పుడు ఈ శకలం కన్పించిందని దీనిపై ఎవరు వివరణ ఇస్తారని ఈ నెటిజన్ ప్రశ్నించారు. సంబంధిత మిస్టరీ వస్తువు విషయంపై ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ కానీ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News