Monday, December 23, 2024

చిన్నారుల్లో మిస్టరీ కాలేయ వ్యాధి.. 35 దేశాల్లో 1000 కేసులు

- Advertisement -
- Advertisement -

Mystery Child Hepatitis Outbreak

మూలాలను పరిశోధిస్తున్న ప్రపంచ ఆరోగ్యసంస్థ

వాషింగ్టన్ : కొన్ని నెలలుగా చిన్నారుల్లో కనిపిస్తోన్న మిస్టరీ కాలేయ వ్యాధి (హెపటిటిస్) తాజాగా 35 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే వెయ్యిమంది చిన్నారుల్లో ఇది బయటపడగా, 22 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహెచ్‌ఒ) వెల్లడించింది. దీని కారణాలను కనుక్కునేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆరోగ్యవంతులైన పిల్లల్లోనూ ఇది బయటపడటం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 5 న చిన్నారుల్లో మొదటి కేసు బయటపడింది. జులై 8 నాటికి ఐదు రీజియన్ల లోని 35 దేశాల్లో 1010 అనుమానిత హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారకాలను కనుగొనే దశలో ఉండగానే 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు వారాల్లోనే కొత్తగా 90 కేసులు, నాలుగు మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల్లో సగం ఐరోపా లోనే నమోదు కాగా, మరో ఐదు వందల కేసులు 21 దేశాల్లో గుర్తించారు. ఒక్క బ్రిటన్ లోనే 272 కేసులు నమోదు కాగా, తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. పశ్చిమ పసిఫిక్, ఆగ్నేయాసియా, తూర్పు మెడిటేరియన్ ప్రాంతాల్లోని చిన్నారుల్లో ఈ మిస్టరీ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు విశ్లేషించిన అనుమానిత కేసుల్లో 60 శాతం మందిలో వికారం లేదా వాంతుల లక్షణాలే కనిపించాయి. 53 శాతం మందిలో కామెర్లు , 52 శాతం మందిలో నీరసం/బలహీనత, 50 శాతం మందిలో కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. లక్షణాలు కనిపించింది మొదలు, ఆస్పత్రిలో చేరికకు నాలుగు రోజుల సమయం పడుతుందని పేర్కొంది. అయితే బాధిత చిన్నారుల్లో హెపటైటిస్ ఎ నుంచి ఇ వరకు లేవని, కొన్ని కేసుల్లో కరోనా వైరస్ వంటి కారణాలను గుర్తించినప్పటికీ వాటిపై సమాచారం అసంపూర్తిగా ఉందని డబ్లుహెచ్‌ఒ వెల్లడలించింది. ఇందుకు అడినో వైరస్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ కచ్చితమైన కారణాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News