Wednesday, January 8, 2025

స్పీకర్ పాత్రపై అపోహలు!

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యారు. ఆయన నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి, విపక్షానికి మధ్య వారధిగా ఉంటూ సామరస్య వాతావరణాన్ని నెలకొల్పవలసిన అవసరం ఉంటుంది. ఈసారి స్పీకర్ ఎన్నిక అధికార పార్టీకి, విపక్షాలకు మధ్య భారీ విభజనను కల్పించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభకు ప్రభుత్వం జవాబుదారీ కావలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా స్పీకర్ నిష్పక్షపాత పాత్ర ఎంతో కీలకమవుతుంది. మెజార్టీ ప్రభుత్వ తీర్పు ప్రకారం స్పీకర్ ఎన్నికైనప్పటికీ, మైనారిటీ వర్గాల అభిప్రాయాలకు కూడా చోటు కల్పించవలసి ఉంటుంది. ఇందులో ప్రభుత్వం ఆయా వర్గాలపై ఆధిపత్యం చేయడానికి స్పీకర్ అవకాశం ఇవ్వరాదు. సంకీర్ణ ప్రభుత్వ పాలనలో స్పీకర్లు తమ పార్టీ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తోంది. గత ఏడాది అసోం అసెంబ్లీని ఉద్దేశించి స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అన్నది చర్చలు, వాదనలపైనే ఆధారపడి ఉందని, అయితే పార్లమెంట్‌లో చర్చలకు అంతరాయం కొనసాగుతుండడం, ఔచిత్యం లోపిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు.

అధికార పార్టీ, విపక్షాల మధ్య అనంగీకారాలు, నిరసనలు సహజమే అయినప్పటికీ, పార్లమెంట్ ప్రతిష్టంభనకు దారి తీయరాదని సూచించారు. ఈ అంశాన్ని ఆయన ఎత్తిచూపినప్పుడు స్పీకర్ల పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉంది.ఏదేమైనా పార్లమెంటులో స్పీకర్ ప్రత్యక్షంగా నేరుగా ఎన్నికైనప్పటికీ రాజకీయ వ్యవస్థలో ఒక భాగమవుతున్నారు. అలాంటప్పుడు పార్లమెంట్ సమావేశాలను ఎలా స్వతంత్రంగా, ఎలా నడపగలుగుతారన్నది ప్రశ్న. ఉదాహరణకు గత ఏడాది అనేక బిల్లులు ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందాయి.146 మంది ఎంపిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇది పార్లమెంట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. మన పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్ కేవలం ఒక సేవకునిగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజకీయ నేతలకు కష్టమనిపించినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్‌కు తగిన స్వేచ్ఛ ఉంటుంది.

అయితే అలా స్పీకర్ స్వతంత్రగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం మన దేశంలో అరుదుగా జరుగుతోంది. బ్రిటన్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఎవరు ఏ అంశంపై మాట్లాడాలో, చర్చించాలో స్పీకరే నిర్ణయిస్తారు. నిబంధనలను త్రోసిరాజని ఏ సభ్యుడైనా ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఉన్నప్పుడు పార్లమెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఆయన వాదిస్తున్నప్పుడు స్పీకర్ సర్‌లిండ్సే హోలే జోక్యం చేసుకుని ‘మీరు గ్రేట్ బ్రిటన్‌కు ప్రధాని కావచ్చు. కానీ ఈ హౌస్ ఆఫ్ కామన్స్‌కు నేను నాయకుడిని. మిమ్మల్ని కూర్చోవలసిందిగా ఆదేశిస్తున్నాను’ అని వారించడం స్పీకర్‌కు ఉన్న అధికారాన్ని గుర్తుచేస్తుంది. ఇటువంటి పరిస్థితి, స్పీకర్ హోదా మన పార్లమెంట్‌లో కనిపిస్తుందా? రెండు రోజుల క్రితం మన పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ స్పీకర్‌ను ఉద్దేశించి ‘మీరు స్పీకర్ అయి ఉండి, ప్రధాని మోడీ ముందు ఎందుకు వంగి నమస్కారం చేస్తున్నారని ప్రశ్నించారు. దానికి స్పీకర్ ఆయన పెద్దవారు కాబట్టి గౌరవంగా వంగి నమస్కారం చేస్తున్నాను అని బదులిచ్చారు.

ఇది అందరినీ నవ్వించినా సీరియస్‌గా తీసుకోక తప్పదు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ పార్టీకి, ఏ వ్యక్తికి వినయంగా వంగి నమస్కారం చేయనక్కర లేదు. 1947 వరకు స్పీకర్ పదవికి ‘సభాధ్యక్షుడు’ అని వ్యవహరించేవారు. 1950 రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత తొలి స్పీకర్‌గా జివి మావలంకర్ ఎన్నికయ్యారు. మన రాజ్యాంగ నిబంధన 93 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఏర్పడ్డాయి. స్పీకర్‌గా ఎన్నికైనవారు ఏ రాజకీయ పార్టీతో అంతవరకు సంబంధం ఉన్నా వదులుకున్నారు.ఈ ఉత్తమ సంప్రదాయాన్ని ఆనాడు నీలం సంజీవరెడ్డి పాటించారు. స్పీకర్ పదవికి ఎన్నిక కావడంతో తాను ఏ రాజకీయ పార్టీ వైపున లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలను నెలకొల్పారు. స్పీకర్‌కు మన రాజ్యాంగంలో ప్రత్యేకమైన విశిష్ట అధికారాలున్నాయి. సభలో క్రమశిక్షణ భంగమై, అయోమయమైన లేదా గందరగోళ పరిస్థితి ఏర్పడితే సభా కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.

ఏ సభ్యుడైనా హద్దుమీరి ప్రవర్తిస్తే అతన్ని అదుపు చేసే అధికారం ఉంది. ప్రశ్నోత్తరాల సమయం, అరగంట చర్చ, బిల్లులపై చర్చ జరిగే సందర్భంలో మాట్లాడాలని ఉత్సాహపడే ప్రతి సభ్యునికి నిష్పాక్షికంగా అవకాశం కల్పించాలి.ఇంగ్లీష్, హిందీ, తెలియని సభ్యులున్నట్టయితే వారు తమ భాషలో మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. వీలైనంతవరకు ఎవరినీ నిరుత్సాహ పర్చరాదు. పార్టీ పాల్పడినవారి విషయంలో సరైన నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలి. మహారాష్ట్రలో స్పీకర్ వైఖరి విమర్శల పాలుకావడం తెలిసిందే. ఏదేమైనా సభా కార్యక్రమాలు హుందాగా, సభా మర్యాదలకు భంగం కలగని విధంగా చూడవలసిన బాధ్యత స్పీకర్‌దే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News