నాచుపెరిగి దుర్గంధం వెదజల్లే
చల్లని శ్మశాన భాషలో బతుకుతున్నాన్నేను
నల్లటి చల్లని తాజా శవాలు
చేరుకుంటాయిక్కడికి ప్రతి రోజూ
రాత్రిపూట కొంచెంగా తలెత్తి చూస్తాయవి
చనిపోయిన వాళ్ళ లాగా తామూ
చనిపోయామో లేదో తెలియని అసందిగ్ధంలో
సజీవ జ్ఞాపకాలున్న వాళ్ళని
గాఢాంధకారం భయపెడుతుంది
మూకదాడుల్లో మృతులైన వాళ్ల శవాలు
అప్పుడప్పుడు పక్కకు దొర్లుతాయి
పక్కటెముకలు తీవ్రంగా నెప్పిపుట్టి
దీనంగా మూలుగుతాయి
తమను పరిత్యజించిన
తమ పిల్లల్ని తలుచుకుని
కొన్ని కంటి రంధ్రాల్లో
కన్నీరు నిండుతాయి
ఆ కళ్ల నుండే శ్మశానంలో
గులాబీ పూలు పూస్తాయి
అత్యాచారానికి గురై హతులైన స్త్రీలు
చనిపోయిన మగాళ్ల కేసి
కన్నెత్తి కూడా చూడరు
తమని లోలోపల నీటి చెలిమెలు లేని
బండరాళ్ళుగా మారుస్తారని వాళ్ళ భయం
చనిపోయిన వాళ్ళు వినే కంఠస్వరాలను
బతికున్నవాళ్ళు నిశ్శబ్దమని పిలుస్తారు,
వాళ్ళు చూసే కాంతిని చీకటి అంటారు
ఆకుల గుసగుస వాళ్ళ సంభాషణ
పూల సువాసనా పక్షుల రాగాలూ
వాళ్ళను భయపెడతాయి
గులాబీల్లో కోరలని, పక్షుల ముక్కులపై
రక్తాన్ని చూసారు వాళ్ళు
బతికున్న వాళ్ళ నవ్వులు జడివానై
వాళ్ళను ముంచేస్తుందని భయపడతారు
తినడానికి వీల్లేని విషపూరిత పుట్టగొడుగులు
మొలుస్తాయి వాళ్లపై
తమ చుట్టూ జరిగే ప్రతిదానికీ
స్పందించమని మృతులని వత్తిడి చేయకు,
వాళ్ళ దగ్గరికి నీ మైకులతో
పరిగెత్తుకుంటూ వెళ్ళకు
వాళ్లకు వార్తలంటే భయం.
కుళ్లిపోతున్న నా దేశభక్తి మాంసానికి
ఒకటే ఆశ
వాళ్ళలా జీవం లేకుండా అయిపోవాలని.
ఎవరూ ప్రార్థించకండి నేను బతికుండాలని
చావు మనల్ని అన్ని సరిహద్దుల నుండీ
విముక్తి చేస్తుంది
చావే నిజంగా అంతర్జాతీయమైంది
ఈ శ్మశానం నా మాతృభూమి
పుర్రె ఆకారంలో ఉన్న ఒకే ఒక్క దేశం,
దీని జాతీయ జండా నల్లటిది
దీని జాతీయ గీతం
ఒక అంతులేని ఆర్తనాదం
కె.సచ్చిదానందన్
అనువాదం: నారాయణస్వామి