Sunday, December 22, 2024

తెలుగు కీర్తి విశ్వవ్యాప్తం

- Advertisement -
- Advertisement -

‘విశ్వ సినీయవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటు తూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాటలో పొందుపరిచిన పదాలు. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి, అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయి.తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును ఈ పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన రచయిత చంద్రబోస్ తెలంగాణ బిడ్డ కావడం.. చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకుడురాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రావ్‌ుచరణ్, జూ. ఎన్‌టిఆర్, కొరియోగ్రాఫర్ ప్రేవ్‌ురక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు..’ ఈ మాటలు అన్నది మరెవరో కాదు.. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్.

తెలుగు పాటకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడంతో ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు పాట అందరినోటా పలుకుతోంది.సంగీత సాగరంలో ప్రస్తుతం ఈ పాట ఉప్పొంగే కెరటాల్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇంతకూ ఈ పాట ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ప్రధాన అంశాలేమిటి?అంతగా ప్రభావితం చేసే అంశాలేంటి? ఒక సాధారణ గిరిజన తెగకు చెందిన గోండు వీరుడికి చెందిన సంతతి జీవన నేపథ్యాన్ని వివరిస్తూ ట్రిపుల్ ఆర్ మూవీలో దర్శకుడు తీసుకున్న ఇతివృత్తం ఎందుకంతలా సినీ వినీలాకాశంలో విహరిస్తోందన్న అంశానికి సంబంధించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పి జార్జ్ స్టాన్లీ చేతుల్లో రూపుదిద్దుకున్న 13.5 అంగుళాల పొడవుతో నగ్నంగా నిలుచున్న ఒక ధీరుని చేతిలో పదునైన ఖడ్గం.. సుమారు నాలుగు కేజీల బరువున్న 24క్యారెట్ల బంగారు పూత పూసిన కళ్లు జిగేల్ మనిపించేలా కనిపించే ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో న్యాయ నిర్ణేతలు ప్రకటించగానే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కీర్తి రెపరెపలాడింది.

మరి ఇంతటి ఘనకీర్తి కలిగిన ఆస్కార్ అవార్డు దక్కించుకోవడానికి నాటు నాటు పాటకు ఉన్న ప్రత్యేకతలు ఒక సారి గుర్తుచేసుకుంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే అది పైకి పాటలా కనిపించినా అంతర్లీనంగా ఒక యుద్ధం దాగి ఉందని చెప్పక తప్పదు. లోతైన అర్థాన్ని పరిశీలిస్తే తమ సాంప్రదాయాలను, పద్ధతులను అగౌరవపరిచి, అవమానించి, హేళనగా చూసిన ఆంగ్లేయులకు తమ నృత్యం, పాట, సాహిత్యంతో తెలుగువాడు ఎదురించి తన సత్తా చాటిన నేపథ్యాన్ని గుర్తించవచ్చు. ఈ పాటలోని సాహిత్యం, సంగీతం, నృత్య దర్శకత్వం, పాట లొకేషన్, వీడియో, ఆడియో, కొరియోగ్రఫీ, కాస్ట్యూవ్‌‌సు, కథ, కథనం ఇలా అన్నింటా ఆ పాటలోని ఔన్యత్యం లోతుగా పరిశీలించిన వారికి స్పష్టంగా కనిపిస్తుంది.

పాట చిత్రీకరణ విషయంలో దర్శకుడు రాజమౌళి స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న పరిస్థితులకు చక్కగా సరిపోయే విధంగా లొకేషన్ ఉండాలన్న ఆశయంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ప్రాంతాలను పరిశీలించి చివరికి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను ఎంపిక చేసి బ్యాక్ డ్రాప్‌గా ఉంచి దిగ్గజ నటులుగా పేరున్న రావ్‌ుచరణ్, ఎన్‌టిఆర్‌తో పాటు భారీ సంఖ్యలో సైడ్ డ్యాన్సర్లను పెట్టి సరిగ్గా ఆనాటి రోజులు గుర్తుకు వచ్చేలా చేసిన కృషి అద్భుతమనే చెప్పాలి. ఇక్కడ మరో విషయం ఏమంటే కీవ్ నగరంలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కలర్ కూడా సరిగ్గా సింక్ కావడం పాట చిత్రీకరణకు సరిపడా విశాలమైన గ్రౌండ్ ఉండటం పాటకు మరింత వన్నెలద్దింది. ఇంద్ర ధనస్సులోని ఏడు రంగులు, ప్రపంచంలోని ఏడు వింతల్లా ఈ పాటలోని ఏడు అంశాలు కూడా ప్రపంచ స్థాయికి చేర్చాయి.

ఎన్‌టిఆర్, రావ్‌ు చరణ్ ధరించిన క్యాస్ట్యూవ్‌‌సు, పాటలోని సాహిత్యం, సంగీతం, నాట్యం, లయ, శబ్దం, చిత్రంలోని కథ అన్నీ కూడా దర్శకుడు రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి చేతిలో అద్భుతంగా రూపుదిద్దుకుని చివరికి ప్రపంచ సినీ అవనికపై తెగులు సినిమా కీర్తి రెపరెపలాడింది. తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసినట్టుగానే ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ వరించింది. ఎవ్‌ు.ఎవ్‌ు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగింది. ప్రపంచ వ్యాప్తంగా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటుతో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్: మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్‌కు పోటీ పడగా.. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సష్టించింది. ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాట గెలుచుకుంది. ఆ అవార్డు గెలుచుకున్న తొలి ఆసియా పాట ఇదే.

మరో ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డు క్రిటిక్స్ ఛాయిస్‌ను కూడా నాటు నాటు దక్కించుకుంది. ఇందులో బెస్ట్ సాంగ్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకోగా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్ నిలిచింది. ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకున్నది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా హెచ్‌సిఎ అవార్డులు దక్కించుకున్నది. బెస్ట్ సాంగ్ విభాగంలో హ్యూస్టన్ ఫిల్మ్ క్రికెట్ సొసైటీ అవార్డును కూడా నాటు నాటు కైవసం చేసుకున్నది.

అదే విధంగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ (ఒఎఫ్‌సిఎస్) అవార్డును సైతం ఈ పాట సొంతం చేసుకోవడం గమనార్హం. ఎవ్‌ు.ఎవ్‌ు కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించాడు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ ఆలపించారు. ప్రేవ్‌ు రక్షిత్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటకు కాస్ట్యూవ్‌ు డిజైనర్‌గా రమా రాజమౌళి పనిచేశారు. దీంతో తెలుగుకు పట్టం కట్టడంతో ప్రధాని సహా వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మాజీ ముఖ్యమంత్రులు, ట్రిపుల్ ఆర్ మూవీ చిత్ర యూనిట్‌కు, తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు సినిమా మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని కోరుకుందాం.

వనం నాగయ్య- 9441877695

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News