Monday, December 23, 2024

ఎన్‌ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో సదుపాయాలు

- Advertisement -
- Advertisement -

‘గుర్తింపు’ కోసం దరఖాస్తు చేయనున్న ఆసుపత్రి
మౌళిక వసతలు కల్పనకు నిధులు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే
రోగులకు మరింత మెరుగైన సేవలు

 NABH Accreditation to Osmania Hospital

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఒక మైలురాయిగా భావించే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ (ఎన్‌ఎబిహెచ్) గుర్తింపు కోసం ఈసారి చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి పోటీ పడనుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు కేవలం ప్రైవేట్ ఆసుపత్రులకే ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు ఉంది. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఉస్మానియా ఎన్‌ఎబిహెచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆసుపత్రి వర్గాలు దృష్టి సారించాయి. ఉస్మానియా ఆసుపత్రికి ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు పొందేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇటీవల రూ.10.14 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆసుపత్రిలో పలు పనులు ప్రారంభించారు.దశలవారీగా మరిన్ని నిధులు ప్రభుత్వం మంజూరు చేయనుంది.

ఎన్‌ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా..

 NABH Accreditation to Osmania Hospital

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు ఉన్న ఆసుపత్రులను ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. మెరుగైన సదుపాయాలు, రోగికి అందే సేవలు సక్రమంగా ఉంటేనే ఎన్‌ఎబిహెచ్ అక్రిడేషన్ లభిస్తుంది. ఈ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల్లో రోగి భద్రత, హక్కుల రక్షణ, రోగితో సిబ్బంది వ్యవహరించే తీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాగే పారిశుధ్యం, అగ్నిమాపక యంత్రాంగం, మురుగునీరు శుద్ధి వ్యవస్థలన్నీ పక్కాగా ఉండాలి. ఈ స్థాయిలో ప్రమాణాలు ఉంటేనే ఆసుపత్రులకు ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు ఇస్తుంది.ఇప్పటివరకు బడా కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రులే ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు కలిగి ఉండగా, మొదటిసారి ఉస్మానియా ఆసుపత్రి ఈ గుర్తింపు పొందేందుకు ప్రయత్నం ప్రారంభించింది. ఇందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుండటంతో ఆసుపత్రి వర్గాలు ఎన్‌ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటికే కొన్ని పనులు పూర్తికాగా, మరికొన్ని త్వరలో పూర్తి కానున్నాయి.

రెండు నెలల్లో గుర్తింపునకు దరఖాస్తు

ఉస్మానియా ఆసుపత్రి ఎన్‌ఎబిహెచ్ అక్రిడేషన్ కోసం మరో రెండు నెలల్లో దరఖాస్తు చేయనుంది. గుర్తింపు ఆసుపత్రి దరఖాస్తు చేసిన తర్వాత ఎన్‌ఎబిహెచ్ బృందం ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించనుంది. తనిఖీలలో భాగంగా ఆస్పత్రుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, రోగులతో వైద్యులు, సిబ్బంది వ్యవహరించే తీరు వంటి అనేక అంశాలను పరిశీలిస్తారు. ఎన్‌ఎబిహెచ్ నిర్ధేశించిన ప్రమాణాలు ఉంటే ఆసుపత్రికి గుర్తింపు లభించనుంది.

రోగులకు మెరుగైన సేవలు

ఉస్మానియా ఆసుపత్రికి ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు లభిస్తే రోగులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. హాస్పిటల్స్‌కు వచ్చే రోగులకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. రోగుల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయి. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించే అవకాశముంటుంది. రోగి సంతృప్తిని ప్రతిరోజు అంచనా వేసే సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. డబ్బులు అడిగినా, విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించినా ఫిర్యాదు చేసేందుకు అవకాశం వుండడంతోపాటు అటువంటి వారిపై చర్యలు తీసుకునే యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది మరింతగా నేర్చుకునేందుకు అనుగుణంగా సదుపాయాలు పెరగనున్నాయి. ఎన్‌ఎబిహెచ్ అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రులు నిరంతరం అభివృద్ధి చెందేందుకు అనుగుణంగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. వీటివల్ల రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాం : డాక్టర్ బి.నాగేందర్, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్

ఉస్మానియా ఆసుపత్రిలో ఎన్‌ఎబిహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు.అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో జరుగుతున్న కొన్ని పనులు పూర్తి కాగానే ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు కోసం దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తూ అవసరమైన నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News